Vijayawada కనకదుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
Vijayawada కనకదుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
ఇంద్రకీలాద్రి( Vijayawada), ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ దంపతులు శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
దర్శనం అనంతరం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ కలెక్టర్ దంపతులకు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. తదుపరి కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి పల్లకీ సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, ఎస్. సరిత, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. కలెక్టర్ దంపతులు ఆలయ సేవా కార్యక్రమాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
