Vasantha Krishna Prasad | అదే వాజ్ పేయి ధ్యేయం..

Vasantha Krishna Prasad | అదే వాజ్ పేయి ధ్యేయం..

Vasantha Krishna Prasad, ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎంతో మందికి ప్రేరణను ఇస్తూ.. రాజనీతి కోవిదునిగా సమున్నత స్థానంలో నిలిచిన అటల్ బిహారి వాజ్ పేయి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడటమే ప్రధాన ధ్యేయంగా కృషి చేశారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరావతి రాజధానిలో వెంకటాయపాలెం వద్ద వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నేతలు ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు తో కలసి బయల్దేరి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాజ్ పేయి సామాన్య పౌరుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి దక్షత ఉంటే.. ఎంతటి పరివర్తనను తీసుకురావచ్చో చేతల్లో చూపించారన్నారు. వాజ్ పేయి నాయకత్వం ఎన్నో రంగాల్లో గణనీయ ప్రభావాన్ని చూపించింది. ఆయన పదవీ కాలంలో సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటీ), టెలికం, కమ్యూనికేషన్స్ రంగాల్లో గొప్ప అభివృద్ధి జరిగిందన్నారు. సర్వ శిక్షా అభియాన్ వల్ల పేదలకు ఆధునిక విద్యను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు వాజ్ పేయి ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వాజ్ పేయి గుర్తించి దానికి తగ్గట్లుగా ఆయన కృషి చేశారన్నారు. అంతర్జాతీయ వేదికల పై కూడా వాజ్ పేయి భారతీయ ప్రాముఖ్యతను చాటి చెప్పారన్నారు. వాజ్ పేయి శత జయంతి వేళ ఆయన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకోవాలన్నారు. వాజ్ పేయి అనుసరించిన సుపరిపాలన, ఐక్యత, ప్రగతి అనే నియమాలను ప్రధాని మోదీ ప్రభుత్వం ద్వారా నెరవేరబోతోందన్నారు. అమరావతిలో అటల్‌ స్మృతివనం ఏర్పాటు చేసి అందులో 13 అడుగుల వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభపరిణాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరావు (బాల), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.