తిరుపతమ్మ అమ్మవారి సన్నిధిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబం
తిరుపతమ్మ అమ్మవారి సన్నిధిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబం
పెనుగంచిప్రోలు ఆలయంలో ప్రత్యేక పూజలు
రాష్ట్ర సుభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థించిన స్పీకర్
ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ
ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే తాతయ్య, నేతలు
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకుని ఆశీస్సులు పొందారు. స్పీకర్ కుమారుడు విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న స్పీకర్ కుటుంబ సభ్యులకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్తో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఎంతోకాలంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించానని, నేడు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తాను మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించానని, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ప్రజల ఆదరణతో ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు.
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో తమ వంతు కృషి అందిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
