వల్లూరు భూ రికార్డులు మాయం చేశారని రైతుల ఆరోపణ

తాసిల్దార్, ఆర్‌ఐపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతి

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన భూ రికార్డులు మాయమయ్యాయని, దీనిపై సంబంధిత అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

రైతుల కథనం ప్రకారం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఉదండాపూర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టిన సమయంలో అప్పటి జడ్చర్ల తహసీల్దార్ బి. లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ సుదర్శన్ రెడ్డి తమ గ్రామానికి సంబంధించిన భూ రికార్డులను మాయం చేశారని ఆరోపించారు.

భూసేకరణ సమయంలో పశువుల కొట్టాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి అగ్రిమెంట్లు తీసుకున్నారని, అయితే 2023 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం అందలేదని రైతులు తెలిపారు.

రికార్డుల గురించి అడిగితే అవి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారని, ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు తమ అగ్రిమెంట్లు, భూ రికార్డులు లభించలేదని పేర్కొన్నారు.

వల్లూరు గ్రామానికి సంబంధించిన భూ రికార్డులను గుర్తించి అందజేయడంతో పాటు, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.