అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యం

ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని బీఎల్‌వోలు సమర్థవంతంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని నారాయణపేట రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. శ్రీను సూచించారు. మంగళవారం ఊట్కూర్ మండల కేంద్రంలో బీఎల్‌వోలు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి పౌరుడి పేరు నమోదు అయ్యేలా ఇంటింటి సర్వేను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చూడాలని బీఎల్‌వోలకు సూచించారు. ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.