రామ్ లీలా మైదానంలో కళ్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు

రామ్ లీలా మైదానంలో కళ్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు

మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు .శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద గల రామ్ లీలా మైదానంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. వేదిక, పందిరి, చలువ పందిళ్లు వంటి ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సూచనల మేరకు ఆలయ ధర్మకర్త పి.ప్రాణేషా చారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయు .

శ్రీరామనవమి పర్వదిన వేడుకలను ప్రతి ఏడాది మాదిరిగ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు దాదాపుగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయ పరిసరాలను కూడా శుభ్రంగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు పాల్గొని సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు .

ఈ వేడుకలకు ప్రముఖులు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సీతారాముల కృపకు పాత్రులు కావడంతో పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆలయ ధర్మకర్త పి. ప్రాణేషా చారి విజ్ఞప్తి చేశారు. సీతారాముల కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.