వెంకటాపురంలో విషాద ఘటన..

వెంకటాపురంలో విషాద ఘటన..

  • బావిలో చిక్కుకుని ఇద్దరి దుర్మరణం

నూగూరు వెంకటాపురం, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని బీసీ మర్రిగూడెంలోని ఓ బావిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం, బద్ది రమేష్ (26) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. బావిలో పడిన అనంతరం కాపాడాలని గట్టిగా అరవడంతో, అతడిని రక్షించేందుకు రేగా నర్సింహారావు (41) బావిలోకి దిగాడు.

అయితే వేసవి కాలం కావడంతో బావిలో నీటి మట్టం లోతుగా ఉండటంతో పాటు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నర్సింహారావు కూడా బావిలోనే చిక్కుకుపోయాడు. చివరకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న సీఐ ముత్యం రమేష్, ఎస్‌ఐ కొప్పుల తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, పాతకాలంలో ఉపయోగించే ‘పాతాళ గరిగె’ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు.

మృతుడు రేగా నర్సింహారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.