వృద్ధుడు అనుమానాస్పద మృతి…
వృద్ధుడు అనుమానాస్పద మృతి..
- జాతీయ రహదారిపై కుటుంబ సభ్యుల ధర్నా
శాయంపేట, ఆంధ్రప్రభ ; హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఘటన అనంతరం పోలీసులు వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామానికి చెందిన కుక్కల సారయ్య (78) మందారిపేట గ్రామానికి చెందిన పున్నం మల్లారెడ్డి ఆయిల్ పామ్ తోటలో గత రెండేళ్లుగా కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆయిల్ పామ్ తోటలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరకాల ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ, గ్రామపంచాయతీ చెత్త తరలించే ట్రాక్టర్లో మృతదేహాన్ని బలవంతంగా తరలించారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆదివారం కొత్తగట్టు సింగారం–మందారిపేట జాతీయ రహదారిపై సుమారు 40 నిమిషాల పాటు ధర్నా నిర్వహించారు. మృతదేహాన్ని పూర్తిగా చూడకుండానే, తమ ఫిర్యాదు తీసుకోకుండానే పోలీసులు తరలించారని ఆరోపించారు. అలాగే ఆయిల్ పామ్ యజమాని కనీసం పరామర్శించలేదని విమర్శించారు.
ధర్నా సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక ఉప సర్పంచ్ కొత్తగట్టు సాయికృష్ణ నిరసనకారులకు మద్దతు తెలిపారు. అనంతరం ఎస్ఐ పరమేశ్వర్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నాను విరమించారు.
