నల్లమల్లలో విజయవంతంగా మాక్ డ్రిల్..
నల్లమల్లలో విజయవంతంగా మాక్ డ్రిల్..
అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు మాక్ డ్రిల్,
నల్లమల్లలో విపత్తు నిర్వహణపై భారీ స్థాయి మాక్ ఎక్సర్‌సైజ్,
ప్రజల రక్షణే లక్ష్యంగా అటవీ ప్రాంతంలో మాక్ డ్రిల్,
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : వరదలు, విపత్తులు, అటవీ అగ్ని ప్రమాదాల సమయంలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై జిల్లా యంత్రాంగం సన్నద్ధతను పరీక్షించే ఉద్దేశంతో సోమవారం నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని రాసమల్లబావి, వట్టువర్లపల్లి, బ్రహ్మగిరి ప్రాంతాల్లో భారీ స్థాయి మాక్ ఎక్సర్‌సైజ్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్,నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరించారు. వాస్తవ అగ్ని ప్రమాద పరిస్థితులను పోలిన సన్నివేశాలను సృష్టించి, వివిధ శాఖల మధ్య సమన్వయం, స్పందనా సమయం, రక్షణ చర్యల అమలు సామర్థ్యాన్ని సమగ్రంగా పరీక్షించారు.

జిల్లా యంత్రాంగం విపత్తుల నిర్వహణలో పూర్తిస్థాయిలో సమాయత్తంగా ఉందని మాక్ డ్రిల్ ద్వారా ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను తలపించాయి. డ్రోన్లు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొన్నారు. మాక్ డ్రిల్‌లో భాగంగా రాసమల్లబావి వద్ద స్టేజింగ్ ఏరియా ఏర్పాటు చేసి సిబ్బంది, వాహనాల రిజిస్ట్రేషన్, పంపిణీ ప్రక్రియను నిర్వహించారు. అటవీ అంచు ప్రాంతంలో I ఇన్సిడెంట్ కమాండింగ్ పోస్ట్ ఏర్పాటు చేసి జిఐసి ఆధారిత మ్యాపింగ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో అటవీ అధికారులతో పాటు అగ్ని నియంత్రణ నిపుణులు పాల్గొని, అటవీ అగ్ని ప్రమాదాల కారణాలు, వాటి వేగంగా వ్యాప్తి చెందే విధానం, అలాగే ముందస్తు జాగ్రత్త చర్యలపై విస్తృతంగా వివరించారు. వట్టువర్లపల్లి ప్రభుత్వ హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రిలీఫ్ & రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదం వల్ల తరలించబడిన గ్రామస్థులకు సహాయక చర్యలు ఎలా అందించాలో ప్రదర్శించారు. అలాగే స్పందనా బృందాల కోసం క్యాంప్, మెడికల్ ఎయిడ్ పోస్ట్, ట్రయాజ్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవల నిర్వహణను పరీక్షించారు.

ఈ డ్రిల్‌లో అటవీ శాఖ, పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, వైద్య & ఆరోగ్య, రవాణా, రోడ్లు & భవనాలు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఫైర్ టెండర్ల ద్వారా మంటలను అదుపు చేయడం, పోర్టబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా, ఫైర్ లైన్ల నిర్మాణం, గ్రామస్థుల తరలింపు వంటి చర్యలను సమన్వయంతో నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర వాహనాల రాకపోకల నిర్వహణను కూడా ప్రదర్శించారు. అటవీ సిబ్బంది భద్రత కోసం కఠినంగా అమలు చేశారు. మాక్ డ్రిల్ అనంతరం జిల్లా కలెక్టర్ అన్ని శాఖల పనితీరును అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత వేగవంతమైన స్పందన కోసం సమన్వయ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
అటవీ ప్రాంతాల సమీప గ్రామాల ప్రజలు, శ్రీశైలం మార్గంలో ప్రయాణించే యాత్రికులు అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే చర్యలను నివారించాలని, పొగ లేదా మంట కనిపించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణలో విభాగాల సమన్వయం, అత్యవసర స్పందన, ప్రజల రక్షణ చర్యల సామర్థ్యాన్ని సమగ్రంగా పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి గిరిధర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, అచ్చంపేట డిఎస్పి శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
