డీఈఓ వేధింపులే కారణం: గౌతమి

ఉద్యోగానికి రాజీనామా చేసిన టీచర్
రీల్స్ వివాదం.. రాజీనామాతో ముగింపు
మానసిక వేధింపులపై గౌతమి ఆరోపణలు
సస్పెన్షన్ తర్వాత రాజీనామా

ఖమ్మం, ఆంధ్రప్రభ: సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా గుర్తింపు పొందిన ఖమ్మం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భూక్యా గౌతమి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) నుంచి ఎదురైన వేధింపులు, మానసిక ఒత్తిడే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఆమె ఆరోపించారు. గతంలో ప్రైవేట్ పాఠశాలను సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేశారనే ఆరోపణలతో తనను సస్పెండ్ చేశారని, సుమారు ఆరు నెలల తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని గౌతమి తెలిపారు.

పోస్టింగ్ అనంతరం కూడా డీఈఓ కార్యాలయం నుంచి తనపై నిరంతరం ఒత్తిడి, వేధింపులు కొనసాగాయని, పలుమార్లు అవమానకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. రీల్స్ వివాదంపై స్పందిస్తూ, పాఠశాల విధుల సమయంలో ఎప్పుడూ ఫోన్ వినియోగించలేదని, ఇంటి వద్ద ఖాళీ సమయంలో మాత్రమే వీడియోలు రూపొందించానని గౌతమి స్పష్టం చేశారు. అయినప్పటికీ అధికారులు, సమాజం తనను తప్పుగా అర్థం చేసుకోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు.