Condemned | పసిమొగ్గ‌పై అత్యాచారం .. నిందితుడ్ని క‌ఠినంగా శిక్షించాల‌న్న ప‌వ‌న్ కల్యాణ్

మంగ‌ళ‌గిరి – అభం శుభం తెలియని పసిమొగ్గపై బంధువుగా చెప్పబడుతున్న వ్యక్తే అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో నాలుగు రోజుల క్రితం జరిగిన మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని, సమాజంగా మనం ఎక్కడ విఫలమవుతున్నామనే ప్రశ్న మన ముందు నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాళ్ళను కఠినంగా శిక్షించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. “గతంలో కథువాలో ఆసిఫా అనే చిన్నారిపై జరిగిన దారుణమైన అఘాయిత్యం, హత్య ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు కూడా రోడ్డుపైకి వచ్చి పోరాటం చేశాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని బలంగా కోరుకున్నాను. అయినా మళ్లీ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే, నిందితుల్లో చట్టం నుంచి తప్పించుకోవచ్చనే ధీమా కారణం కావొచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ దారుణానికి పాల్పడిన కిరాతకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. నిందితుడికి అత్యంత కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి పైశాచిక చర్యలకు పాల్పడాలంటేనే భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను, డీజీపీని, హోంశాఖ మంత్రి అనిత ని ఆయన కోరారు.

చిన్నారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్ కల్యాణ్, నిందితులకు కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. చిన్నారులపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి సమాజం మొత్తం మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *