రావణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: జనసేన నేత కొట్టే వెంకట్రావు
- ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయొద్దని హితవు
- పేర్ని నానిపై విమర్శలు.. కూటమిలో కాపులకు గౌరవం ఉందని వ్యాఖ్య
మచిలీపట్నం, జూలై 5 (ఆంధ్రప్రభ): సోషల్ మీడియా కార్యకర్త రావణ్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ప్రజల్లో తిరగడం కష్టమవుతుందని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొట్టే వెంకట్రావు హెచ్చరించారు. ఆదివారం మచిలీపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రావణ్‌కు సంబంధించిన పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తోందని ఆరోపించడం సరికాదన్నారు.
రావణ్ తన తప్పును అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. కాపు సామాజిక వర్గాన్ని కూటమి నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని, కూటమి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి తగిన గౌరవం, ప్రాధాన్యం లభిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలను నమ్మే పరిస్థితి లేదన్నారు.
సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు, నాయకులు గరికపాటి శివ, త్రిమూర్తి, కర్రీ మహేశ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
