60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కేసీఆర్‌దే

60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కేసీఆర్‌దే
- దొనకంటి నరసయ్య
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 26వ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షుడు దొనకంటి నరసయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక బస్టాండ్ వద్ద గులాబీ జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దొనకంటి నరసయ్య మాట్లాడుతూ.. 2001లో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ పార్టీ, 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల అలుపెరగని పోరాటం ద్వారా 60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టుతో వ్యవసాయ రంగాన్ని రూపురేఖలను మార్చివేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, మాజీ రైతు బంధు అధ్యక్షులు శర్మ నాయక్, మాజీ జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మొయిజ్, కార్మిక శాఖ అధ్యక్షుడు డిష్ గంగాధర్ పాల్గొన్నారు. వీరితో పాటు కౌన్సిలర్లు గున్నాల భగత్, బి. నర్సయ్య, నీలం రవి, మల్లెల ప్రసాద్, రాజు నాయక్, అశోక్, రత్నం, గోపి, సాగర్, అవినాష్, తుకాజి నాయక్, లింగం, పర్స నవీన్, సాయి, మూడేళ్ల ప్రకాష్, ముత్తన్న, రహమాన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
