ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై నిఘా పెంచాలి
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై నిఘా పెంచాలి
-డీఈఓకు బీఆర్ఎస్వీ వినతి
భూపాలపల్లి రూరల్ ,ఆంధ్రప్రభ:
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డీఈఓకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు కొల్లోజు దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచడంతో చిన్న, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందన్నారు.
కొన్ని పాఠశాలలు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు. ఐఐటీ, జేఈఈ, సీబీఎస్ఈ కోచింగ్ పేరిట అదనపు ఫీజులు వసూలు చేస్తున్న విషయంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుని నిరుపేద విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో భూక్య హరీష్, బానోతు మహేశ్వర్, కత్తి వినయ్ గౌడ్, కళ్లేపల్లి ప్రేమ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు.
