దళిత భూముల రక్షణపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరిక

దళిత భూముల రక్షణపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరిక

మేడ్చల్, ఆంధ్రప్రభ: దళితులు, పేదల భూములను ఎవరు కబ్జా చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి డివిజన్‌లో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్‌కు చెందిన వివాదాస్పద భూములను జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కొందరు వ్యక్తులు అహంకారంతో దళితుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని మంత్రి హెచ్చరించారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన సుమారు 49 ఎకరాల 21 గుంటల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ భూములకు సంబంధించి బుధవారానికి పూర్తి నివేదికను వీసీఎండీ ద్వారా కలెక్టర్‌కు అందజేయాలని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే పూర్తి స్థాయి సర్వే నిర్వహించి సరిహద్దులు (డీమార్కేషన్) ఖరారు చేయాలని అధికారులను సూచించారు.

భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారు వెంటనే ఖాళీ చేయాలని, వారు స్వయంగా ఆక్రమణలను తొలగించుకోవాలని మంత్రి హెచ్చరించారు. లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, భవిష్యత్తు ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు, బాధిత రైతులు డిమాండ్ చేశారు. మునిరాబాద్, ఎల్లంపేట ప్రాంతాల్లోని ఎస్సీ కార్పొరేషన్ భూములు, చెరువులు, గోదాముల కబ్జాలపై వారు నిరసన తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అధికార బలంతో భూములు ఆక్రమించారని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పేదల భూములపై అన్యాయం జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉండటం దారుణమని విమర్శించారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. లేదంటే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం తగ్గుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, జిల్లా కలెక్టర్ మను చౌదరి, మల్కాజ్గిరి ఆర్డీవో శ్యాం ప్రకాష్, మేడ్చల్ ఇన్చార్జి ఎంఆర్ఓ అనూష, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర జంగయ్య యాదవ్, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఏసీపీ శంకర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, గుండ్ల పోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి పేట శ్రీనివాస్, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, అప్పమ్మ గారి రామ్ రెడ్డి, బాల్ రెడ్డి, వేముల శ్రీనివాసరెడ్డి, స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో బాధితులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.