వర్ధమాన క్రికెటర్ నెవీన్ మానిత్కు జగ్గారెడ్డి అండ
వర్ధమాన క్రికెటర్ నెవీన్ మానిత్కు జగ్గారెడ్డి అండ
- శిక్షణ, టోర్నమెంట్ల ఖర్చులు భరిస్తానని హామీ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి పట్టణానికి చెందిన వర్ధమాన క్రికెటర్ నెవీన్ మానిత్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. యువ క్రికెటర్ ప్రతిభ గురించి ఆయన తండ్రి, కాంగ్రెస్ నాయకుడు, ఫిజియోథెరపిస్ట్ మధు ద్వారా తెలుసుకున్న జగ్గారెడ్డి, భవిష్యత్తులో ఉన్నత స్థాయి క్రికెటర్‌గా ఎదగడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
మానిత్ మరింత మెరుగైన శిక్షణ పొందేందుకు, వివిధ జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. క్రీడలో మరింత రాణించి సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయిలో ప్రతిభ
18 ఏళ్ల నెవీన్ మానిత్ ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తితో కష్టపడి సాధన చేస్తూ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్నాడు. 2024లో బీహార్‌లోని పాట్నాలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) అండర్-17 జాతీయ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2026లో చండీగఢ్‌లో నిర్వహించిన అండర్-19 జాతీయ పోటీల్లోనూ పాల్గొని ఆకట్టుకున్నాడు.
వెంకటస్వామి గోల్డ్ కప్ సీనియర్ లీగ్‌లో మెదక్ జిల్లా తరఫున ఆడి మహబూబ్‌నగర్ జట్టుపై హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అలాగే ఢిల్లీలోని ప్రముఖ క్లబ్ తరఫున ఆడి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లీగ్స్‌లో స్పోర్టి క్లబ్ తరఫున టీ20, వన్డే, టూ-డే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
కోచ్‌ల మార్గదర్శకత్వంలో రాటుదేలిన ప్రతిభ
ఆరవ తరగతి నుంచే ఎమ్మెస్ క్రికెట్ అకాడమీలో కోచ్‌లు చంద్రమౌళి, ఇనాం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మానిత్, HCA ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ప్రోత్సాహంతో మరింతగా ఎదిగాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇక్బాల్ క్రికెట్ అకాడమీలో కోచ్ ఇక్బాల్ వద్ద ఉన్నత స్థాయి శిక్షణ పొందుతున్నాడు.
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మాజీ క్రికెటర్ రఘు తదితరులు పాల్గొని మానిత్ను అభినందించారు. జగ్గారెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతో నెవీన్ మానిత్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
