Monsoon | రుతుప‌వ‌నాల రాక‌తో మారిన వాతావ‌ర‌ణం

Monsoon | రుతుప‌వ‌నాల రాక‌తో మారిన వాతావ‌ర‌ణం

Monsoon | రాయ‌ల‌సీమ‌లో ఉరుములు, మెరుపుల వాన‌
తెలంగాణ‌లోనూ ఈదురుగాలులు
రైత‌న్న‌ల్లో చిగురించిన ఆశ‌లు
రాబోయే రెండ్రోజుల్లో మ‌రింత‌గా విస్త‌ర‌ణ‌

Monsoon | హైద‌రాబాద్ / అమ‌రావ‌తి, ఆంధ్ర‌ప్ర‌భ : సుదీర్ఘ కాలంగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ ఉపశమనం కలిగించే క‌బురు తెచ్చింది. ఎప్పుడెప్పుడా అని రైతాంగంతో పాటు సాధారణ ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శరవేగంగా అన్ని దిక్కులకూ విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశాయి.

ఏపీలో ఏడు జిల్లాల‌లో వాన‌లు

ఆంధ్రప్రదేశ్ లోని రుతుపవనాలు నాలుగైదు రోజుల ముందే ప్రవేశించాయి. దీంతో ప్రస్తుతం వర్షాలు జోరందుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మంగ‌ళ‌వారం నాడు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ఉరుములు, మెరుపులు..

భారీ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని తెలిపింది. కాబట్టి వర్షం కురిసే సమయంలో చెట్లకింద, తాత్కాలిక నివాసాల్లో ఉండకూడదని… సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది. హెచ్చరికలు జారీచేసిన జిల్లాల్లోనే కాదు మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ తెలిపింది.

తెలంగాణ‌లోనూ..
తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయట. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగుతాయట… దీంతో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గి 30-35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది.

అన్నదాతల్లో చిగురించిన ఆశలు
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను తాకాయి. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలోని చాలా భాగాలకు ఇవి వేగంగా విస్తరించాయి. వానాకాలం అధికారికంగా ప్రారంభం కావడంతో అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాబోయే ఖరీఫ్ సాగు పనులకు సమాయత్తం అయ్యేందుకు ఈ తొలకరి వర్షాలు ఎంతో అనుకూలంగా మారనున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే రెండు రోజుల్లో భారీ విస్తరణ
రాబోయే రెండు మూడు రోజుల్లో వాతావరణం మరింత చల్లబడి వానల తీవ్రత పెరగనుంది. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని మరికొన్ని సువిశాల ప్రాంతాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగిలిన భాగాలకు పూర్తిగా విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారాయి. కేవలం దక్షిణాది రాష్ట్రాలే కాకుండా నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు సైతం ఇవి విస్తరించనున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ ఈ రుతుపవనాలు తమ పూర్తి ఆధీనంలోకి తీసుకోబోతున్నాయి.

click here to read 12cylinders | పేద‌ల గ్యాస్ బండ‌కు కోత‌లు

click here to read more

Leave a Reply