MDK | పిడుగుపాటుకు.. ఇద్దరు చిన్నారుల బలి..

తూప్రాన్, ఆంధ్రప్రభ : పిడుగు ప‌డ‌డంతో ఇద్ద‌రు చిన్నారులు మృతిచెంద‌గా, మ‌రొక‌రికి గాయాలైన ఘ‌ట‌న ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని తూప్రాన్ లో చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా భారీ వర్షం రావడంతో చిన్నారులు చెట్టు కిందికి వెళ్లగా ఈ చెట్టుపై పిడుగు ప‌డ‌డంతో ఇద్దరు మృతిచెంద‌గా, ఒకరికి గాయాలైన ఘటన శనివారం సాయంత్రం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడాలపల్లిలో జరిగింది.

గ్రామానికి చెందిన నడిపల్లి యశ్వంత్ (13), పంబాల ప్రశాంత్ (15), ముఖద్దం రవికిరణ్ లు శివారు కుంట ప్రాంతంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం రావడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి నిలుచున్నారు. చెట్టుపై భారీ స్థాయిలో పిడుగు పడడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా రవికిరణ్ కు స్వల్ప గాయాలవడంతో తూప్రాన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనతో మృతిచెందిన చిన్నారుల తల్లుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply