పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై కేంద్రంపై ధ్వజం
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై కేంద్రంపై ధ్వజం
సీపీఎం నేత ఎండి జాహంగీర్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెను భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జాహంగీర్ విమర్శించారు. సోమవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన సీపీఎం మండల జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి మండల కార్యదర్శివర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జాహంగీర్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వరుసగా పెంచడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతూ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రాగిరి కిష్టయ్య, గడ్డం వెంకటేశం, బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాసు, బోదాస్ వెంకటేశం, కొండే శ్రీశైలం, కొంతం సుశీల, చెరుకు లక్ష్మమ్మ, చీరిక అలివేలు, పగిళ్ల శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.
