రండి… ప్రభుత్వ కాలేజీల్లో చేరండి
రండి… ప్రభుత్వ కాలేజీల్లో చేరండి
–ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆధ్యాపకుల ప్రచారం
–ప్రణాళికబద్ధంగా గ్రామాల్లో క్యాంపెయిన్
తొర్రూరు, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లను పెంచేందుకు లెక్చరర్లు నడుం బిగించారు. రెగ్యులర్ అధ్యాపకులతోపాటు, కాంట్రాక్ట్ అధ్యాపకులు సైతం కదం కలిపారు. ‘రండి.. ప్రభుత్వ కాలేజీల్లోనే చేరండి.. అంటూ క్యాంపెయిన్ చేపట్టారు. తాజాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సైతం కార్యాచరణలోకి దిగాయి. నిష్ణాతులైన అధ్యాపకులచే బోధన, డిజిటల్ తరగతులు, ఆధునిక ప్రయోగశాలలు మా కళాశాలలో ఉన్నాయంటూ.. మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండంటూ ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్‌ను పెంచేందుకు సిబ్బంది వినూత్న కార్యక్రమం చేపట్టారు. తాజాగా తొర్రూరు మండలంలోని, సమీప మండలాలలోని పలు గ్రామాల్లో తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ముమ్మర ప్రచారం చేపట్టారు.
విద్య సౌకర్యాలపై ప్రచారం….
పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న మెరుగైన వసతులపై అధ్యాపకులు తల్లిదండ్రులకు విద్యార్థులకు వివరిస్తున్నారు. ఉపకార వేతనాలు, ఉచిత పుస్తకాల అందజేత తదితర అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.
ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. కళాశాలలో చదివేందుకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, అర్హులందరికీ ఉపకారవేతనాలను ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు.
కళాశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రతిభగల లెక్చరర్లతో విద్యను బోధించడం జరుగుతుంది. కళాశాలల్లో విద్యార్థుల కోసం పక్కాభవనాలు, ప్రయోగశాలలు, గ్రంధాలయం, క్రీడా మైదానం, ఎన్‌ఎస్‌ఎస్ వంటివి సౌకర్యాలున్నాయి.జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. గడిచిన ఏడాది ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 51 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 65 శాతం ఉత్తీర్ణత విద్యార్థులు సాధించారు.
జిల్లాలో 8,152 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా …8,055 మంది ఉత్తీర్ణత సాధించారు.
మార్పులకు శ్రీకారం….
ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి సిలబస్ లో మార్పు చేయడమేకాక విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు లబ్ధి జరగనుంది. ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు కాలేజీలకు చేరాయి. కాగా ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏసీఈ(అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) కొత్త కోర్సు ప్రారంభించనుంది.
ఈ ఏడాది నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం…
ఇన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలవుతోంది. పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయాన జూనియర్ కాలేజీల విద్యార్థులకు సైతం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. తద్వారా దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ఆకలి తీరుతుందని, చదువుపై శ్రద్ధ కనబరుస్తారని భావిస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య: -మదార్ గౌడ్, డీఐఈఓ, మహబూబాబాద్
ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారు. ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలుకానుంది. ప్రైవేట్ కాలేజీల్లో చేరి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వ కళాశాలల్లో చేరి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.

