June 2nd | రైతు డిస్కమ్‌పై ఉత్కంఠ‌

June 2nd | రైతు డిస్కమ్‌పై ఉత్కంఠ‌

అప్పులతో కొత్త డిస్క‌మ్‌ మనుగడ సాధ్యమేనా
మూడో డిస్కమ్​తో ఏర్పాటుతో ప్రయోజనాలేంటి
రైతులకు ఉచిత విద్యుత్​ లేకుండా చేస్తారా?
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుప‌రం చేయ‌డానికా
త‌క్కువ సిబ్బందితో మెరుగైన ప‌నితీరు సాధ్యామా
కాళేశ్వ‌రం, మిష‌న్ భ‌గీర‌థ‌, హైద‌రాబాద్ వాట‌ర్ బోర్డు వంటి కీల‌క ప‌థ‌కాలు
బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అభ్యంత‌రం చెబుతోంది
ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి బెట్టుగా ఎందుకున్నారు?
సామాన్యుల మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమేదీ

June 2nd | సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : 29 లక్షల రైతు కనెక్షన్లు.. రూ.72 వేల కోట్ల భారం.. ఉచిత విద్యుత్ భవిష్యత్తుపై చర్చ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కమ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా విద్యుత్ రంగంలోనూ ప్రధాన చర్చగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) ఏర్పాటవుతోంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీన్ని కార్యాచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

June 2nd |
June 2nd |

తెలంగాణలో మూడో డిస్కమ్ ఎందుకు?

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో రెండు డిస్కమ్‌లు పనిచేస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో TGSPDCL, ఉత్తర తెలంగాణలో TGNPDCL విద్యుత్ పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఇవి గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వ్యవసాయ రంగానికీ విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. అయితే.. పదేళ్లలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం వల్ల డిస్కమ్‌లపై భారీ ఆర్థిక భారం పడింది. రైతుల నుంచి ప్రత్యక్ష ఆదాయం లేకపోవడం, ప్రభుత్వ సబ్సిడీలు, బకాయిలు పెరగడం వంటి కారణాలతో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఈ ఆర్థిక ఒత్తిడి, పెరుగుతున్న అప్పులు, నష్టాల ప్రభావం డిస్కమ్‌ల పనితీరుపైనా పడింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా పంపిణీ సంస్థల పనితీరు ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు చెందిన TGSPDCL 51వ స్థానంలో, TGNPDCL 52వ స్థానంలో నిలిచాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తక్కువ ర్యాంకులకు ప్రధాన కారణాల్లో భారీ అప్పులు, ఆర్థిక నష్టాలు, సబ్సిడీ బకాయిల భారం కూడా ఒకటిగా పరిగణనలోకి వస్తోంది. కాగా, 2025 మార్చి నాటికి రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల కలిపి నష్టాలు ₹59,671 కోట్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పనితీరు ర్యాంకింగ్స్‌లో తెలంగాణ డిస్కమ్‌లు దేశంలో చివరి స్థానాలకు చేరుకోవడం కూడా ఆందోళన కలిగించింది.

June 2nd | రైతు డిస్కం ప్రస్తుత స్దితి
అంశం వివరాలు

వ్యవసాయ కనెక్షన్లు 29.05 లక్షలు
వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు 5.60 లక్షలు
మొత్తం విద్యుత్ సబ్సిడీ (2025-26) రూ.13,499 కోట్లు
వ్యవసాయ సబ్సిడీ రూ.11,602 కోట్లు
డిస్కమ్‌ల మొత్తం నష్టాలు రూ.59,671 కోట్లు
రైతు డిస్కమ్ ప్రారంభ మూలధనం రూ.5 కోట్లు
బదిలీ కానున్న అప్పులు రూ.71,964 కోట్లు

June 2nd | రైతు డిస్కమ్ పరిధిలో ఏముంటాయి..

కొత్త సంస్థ ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, కాళేశ్వరం వంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు తదితర నీటి సరఫరా వ్యవస్థలకు విద్యుత్ అందిస్తుంది. అంటే రైతులు, నీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ నీటి సరఫరా వ్యవస్థలు రైతు డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు మాత్రం ప్రస్తుత రెండు డిస్కమ్‌ల కిందనే కొనసాగుతారు.

ప్రభుత్వం చెబుతున్న ప్రయోజనాలేమిటి..

రైతు డిస్కమ్ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం వ్యవసాయ విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా పర్యవేక్షించడమేనని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నప్పుడు మరమ్మతులు వేగంగా చేయడం, గ్రామీణ విద్యుత్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టడం, రైతులకు మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అలాగే వ్యవసాయ సబ్సిడీ భారాన్ని వేరుచేయడం వల్ల ప్రస్తుతం ఉన్న రెండు డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో వాటి క్రెడిట్ రేటింగ్ మెరుగై భవిష్యత్తులో తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, విద్యుత్ మీటర్ల పేరుతో రైతులపై భారం మోపే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

రూ.72 వేల కోట్ల భారంతో మనుగడ సాధ్యమా..

అయితే.. రైతు డిస్కమ్‌పై ప్రధాన విమర్శ ఆర్థిక అంశానికే సంబంధించి వస్తోంది. కొత్త సంస్థ ప్రారంభ మూల ధనం కేవలం ₹5 కోట్లు మాత్రమే. కానీ, దీనికి బదిలీ అవుతున్న అప్పులు, బకాయిలు, ఇతర భారం విలువ దాదాపు రూ.71,964 కోట్లుగా ఉంది. ఇందులో ప్రభుత్వ శాఖల బకాయిలు, విద్యుత్ కొనుగోలు చెల్లింపులు, రుణాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం నుంచి ప్రత్యక్ష ఆదాయం లేకపోయినప్పుడు ఈ భారీ భారాన్ని సంస్థ ఎలా భరిస్తుందనే ప్రశ్నలు నిపుణుల నుంచి వస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు భవిష్యత్తులో ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యంతరాలు ఏమిటి..

బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త డిస్కమ్​ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉచిత విద్యుత్ పథకాన్ని క్రమంగా బలహీనపరచేందుకు ఇది మొదటి అడుగు కావచ్చని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, భవిష్యత్తులో రైతులపై అదనపు భారం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవేపు 29 లక్షలకుపైగా కనెక్షన్లు, 5.5లక్షల ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ కేవలం 2000 మంది సిబ్బంది సంఖ్య సరిపోదని విద్యుత్ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారుల నుంచి వచ్చే ఆయాయం లేకుండా రైతు డిస్కమ్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమని కూడా ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే కుట్ర: బీఆర్ఎస్

ఉచిత విద్యుత్ ను రద్దు చేసేందుకు రైతు డిస్కం ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిందని మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈఆర్సీ ఎదుట వాదనలు వినిపించారు. రైతు డిస్కం ఆలోచనలను వెనక్కి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి తరుపున వారు డిమాండ్ చేశారు. రైతు డిస్కం నిజానికి రైతుల ప్రయోజనాల కోసం కాదని పేర్కొన్నారు. రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌ను క్రమంగా ఎత్తివేయడంతో పాటు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూపొందించిన కుట్రలో భాగమని ఆరోపించారు. రైతు డిస్కామ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న సంస్థ రైతులను చీకట్లలోకి నెట్టే ఉరి డిస్కంగా మారే ప్రమాదం ఉందన్నారు.

CLICK HERE TO READ MORE : Rs.20ThousandperMonth | వేత‌న జీవుల‌.. జీవితాల్లో వెలుగులు

CLICK HERE TO READ MORE

Leave a Reply