ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల భాగస్వామ్యం కీలకపాత్ర
కలెక్టర్ ఏమంత కేశవపాటి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్‌లో విద్యాభివృద్ధిపై అవగాహన సదస్సులో, పాఠశాలల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులు చురుకుగా ఉండాలని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఎమ్మెల్సీ కూచ్చుకుళ్ళ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామ సర్పంచులు, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ సభ్యులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని డీ.కేఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో, విద్యా వారోత్సవాల్లో భాగంగా, విద్యాభివృద్ధిపై అవగాహన సదస్సులో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, శాసన మండలి సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి హాజరయ్యారు.

కార్యక్రమాన్ని సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ…., రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు చొరవ చూపినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

ప్రతి సర్పంచ్, వార్డు సభ్యుడు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తరచూ సందర్శించి విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన, పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

విద్యాభివృద్ధి ద్వారా మాత్రమే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామ పరిధిలో ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల పట్ల పూర్తి అవగాహన కల్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలలో నమోదు శాతాన్ని పెంచేలా సర్పంచులు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.
శాసనమండలి సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ…., గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాల పెంపుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. గ్రామాల్లో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల ఆకర్షణలో పడి ఆర్థికంగా దెబ్బ తినడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తులను నాశనం చేసుకుంటున్నారని, ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్యా అందుతుందని అందుకు అనుగుణంగా సర్పంచులు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ…., జిల్లా విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు అందజేయడంతోపాటు,విద్యార్థుల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలు, పదో తరగతిలో సాధించిన ఫలితాలపై వివరించారు. విద్యార్థుల నమోదు పెంపు, మధ్యాహ్న భోజన పథకం అమలు, డిజిటల్ తరగతులు, పాఠశాలల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించారు.
ఈ సదస్సులో పాల్గొన్న సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు తమ గ్రామాలు, వార్డుల పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, నాగర్ కర్నూల్ మండల విద్యాధికారి కురుమయ్య, సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, వెంకటేశ్వర్ల శెట్టి, నియోజకవర్గ పరిధిలోని మండలాల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
