మక్కల కొనుగోళ్లల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వం

మక్కల కొనుగోళ్లల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వం

  • కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

కేసముద్రం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మొక్కజొన్న (మక్కల) కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధనసరి, కేసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో, మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు, బస్తాల తరలింపు వివరాలను ఆయన వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మార్చి 27 నుండి కేసముద్రం, ధనసరి పీఏసీఎస్ పరిధిలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని చైర్మన్ తెలిపారు. రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా ఇనుగుర్తి, తాళ్లపూసపల్లి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో కొనుగోళ్లు చేపట్టినట్లు వివరించారు. గత కొద్ది రోజులుగా లారీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాల్లో బస్తాల రవాణాకు కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతం ట్రాక్టర్ల ద్వారా మక్కల బస్తాలను మార్కెట్ యార్డుకు తరలించి నిల్వ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ రవాణా ప్రక్రియలో రైతులు పోలీసులకు, మార్కెట్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

మక్కల కొనుగోలు అధికారిక గణాంకాలు:
ధనసరి సొసైటీ:
ఇప్పటివరకు 3,001 మంది రైతుల నుండి 2,84,528 బస్తాల మక్కజొన్నను కొనుగోలు చేశారు. ఇందులో 1,53,208 బస్తాలను పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల గోదాములకు తరలించగా, మిగిలిన 1,27,212 బస్తాలను కేసముద్రం మార్కెట్ యార్డులో భద్రపరిచారు.

కేసముద్రం సొసైటీ (తాళ్లపూసపల్లి కేంద్రం) 261 మంది రైతుల నుండి 29,529 బస్తాలను కొనుగోలు చేసి మార్కెట్ యార్డుకు తరలించారు. 475 మంది రైతుల నుండి 59,413 బస్తాలను సేకరించి మార్కెట్ యార్డులో నిల్వ చేశారు.

అసత్య ప్రచారాలను నమ్మవద్దు
మక్కల కొనుగోళ్లపై గత కొద్ది రోజులుగా వివిధ ఛానెళ్లు, సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియా) వస్తున్న అసత్య ప్రచారాలను రైతులు ఎవరూ నమ్మవద్దని చైర్మన్ గంట సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ప్రతి బస్తాను త్వరలోనే పూర్తి స్థాయిలో మిల్లులకు, గోదాములకు తరలిస్తామని, నిబంధనల ప్రకారం రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ ప్రత్యేక హోదా కార్యదర్శి అమర లింగేశ్వర్ రావు, కేసముద్రం ఎస్సై క్రాంతి కిరణ్, మండల వ్యవసాయ అధికారి (AO) వెంకన్న, సొసైటీ సీఈఓలు గోపాల మల్లారెడ్డి, ఎల్లయ్య మరియు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply