రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం


నాలుగు వాహనాలు ధ్వంసం.. ఒకరికి తీవ్ర గాయాలు

బెజ్జంకి, ఆంధ్రప్రభ: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారయ్యాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన చొప్పరి సంపత్ (38), అతని తమ్ముడు చొప్పరి చందు ట్రాక్టర్‌ (TS22T1099)పై తంగళ్లపల్లి ఐకేపీ సెంటర్ నుంచి వరి లోడును ఎక్కించుకుని మల్లారం గ్రామంలోని రామాంజనేయ అగ్రో మిల్‌కు బయలుదేరారు.

రేగులపల్లి గ్రామ శివారులోని సెయింట్ పల్లోటి స్కూల్ సమీపానికి చేరుకున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన అశోక్ లేలాండ్ ఇసుక లారీ (TS36TA6966) అతివేగంగా వచ్చి ట్రాక్టర్ ట్రైలర్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది.

ఈ ఢీకొట్టడంతో ట్రాక్టర్ అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లి అక్కడే నిలిపి ఉన్న మారుతి బ్రెజ్జా కారు (TG02B0671), ఇన్నోవా కారు (TG21T1653)లను ఢీకొట్టింది. అనంతరం ట్రాక్టర్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని ఆగిపోయింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్, ట్రైలర్‌తో పాటు రెండు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ట్రాక్టర్‌లో ఉన్న వరి లోడు కూడా చెదిరిపోయి నష్టం వాటిల్లింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ చొప్పరి చందుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా సిద్ధిపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Leave a Reply