Driving License | మానవత్వానికి జరిమానా?..

లిఫ్ట్ ఇచ్చిన ఐటీ వ్యాపారికి రూ.1,500 ఫైన్
వర్షంలో సాయం చేసినందుకే చలానా..

దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెర

Driving License | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: వర్షంలో తడుస్తూ, రోడ్డుపై ఇబ్బంది పడుతున్న వారిని చూసి జాలి వేసింది. కారు ఆపి లిఫ్ట్ ఇచ్చాడు. మానవత్వం చూపాననుకున్నాడు. కానీ, కొన్ని నిమిషాల్లోనే చేతిలో చలానా, డ్రైవింగ్ లైసెన్స్ పోలీసుల వద్ద, చివరకు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురైంది. లిఫ్ట్ ఇవ్వడం కూడా నేరమేనా? అనే ప్రశ్నకు కారణమైన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రాత్రి వేళ… కుండపోత వర్షం… ట్రాఫిక్ జామ్… అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ముగ్గురు అపరిచితులకు కారులో లిఫ్ట్ ఇచ్చినందుకు ట్రాఫిక్ పోలీసులు రూ.1,500 జరిమానా విధించారు. అంతేకాదు, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకుని, కోర్టులో జరిమానా చెల్లించిన తర్వాతే తిరిగి తీసుకోవాలని సూచించారు. “ఇకపై ఇలా చేయొద్దు” అంటూ హెచ్చరిక కూడా జారీ చేశారు.

ఇప్పటివరకు బైక్ లేదా కారు నడిపే వాహనదారుల్లో 99 శాతం మందికి కూడా అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియకపోవడం ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశంగా మారింది.

ఏం జరిగిందంటే…

ముంబైకి చెందిన నితిన్ నాయర్ ఐటీ రంగంలో పనిచేస్తూ, ఇటీవలే సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించారు. జూన్ 18న సాయంత్రం ఎప్పటిలాగే కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరారు. ఐరోలి సర్కిల్ సమీపానికి చేరుకునే సరికి భారీ వర్షం కురుస్తోంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.

అలాంటి సమయంలో వర్షంలో తడుస్తూ, లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆయన కంటపడ్డారు. వారి పరిస్థితి చూసి చలించిపోయిన నితిన్… కారు ఆపి, వారు వెళ్లాల్సిన ప్రదేశం తెలుసుకుని కారులో ఎక్కించుకున్నారు.

అయితే, ఈ దృశ్యాన్ని కొంత దూరం నుంచి గమనిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్… కారు వద్దకు వచ్చి నితిన్‌ను ప్రశ్నించారు.

“లిఫ్ట్ ఇచ్చానంతే…”

విషయం వివరించిన నితిన్‌కు ట్రాఫిక్ పోలీసులు వెంటనే రూ.1,500 చలానా విధించారు. కారణం అడగగా… “అపరిచితులకు లిఫ్ట్ ఇచ్చారు” అని సమాధానం చెప్పారు.

అంతటితో ఆగలేదు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 66/192 ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, జరిమానా కోర్టులో చెల్లించిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందాలని సూచిస్తూ చలానా అందించారు.

నితిన్ ముందుగా కారులో ఎక్కించుకున్న ముగ్గురినీ వారి గమ్యస్థానాలకు చేర్చారు. అనంతరం కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి తీసుకున్నారు.

“లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు పోయింది”

ఈ ఘటనపై స్పందించిన నితిన్… “12 ఏళ్ల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటివరకు ఇలాంటి నిబంధన ఉందని నాకు తెలియదు. లిఫ్ట్ అంటే అపరిచితులకే ఇస్తాం కదా. వర్షంలో ఇబ్బంది పడుతున్న వారిని చూసి మానవత్వంతో సహాయం చేశాను. కానీ, దానికి ఓ రోజు మొత్తం కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త చర్చకు తెర

తనకు ఎదురైన అనుభవాన్ని నితిన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. “లిఫ్ట్ ఇవ్వడం నిజంగానే నేరమా?”, “మానవత్వం చూపిస్తే జరిమానా వేస్తారా?” అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.

అయితే, ఈ సందర్భంగా మరో విషయం కూడా గుర్తుంచుకోవాల్సిందే. వ్యక్తిగత వాహనాలను అనధికారికంగా ప్రయాణికుల రవాణా కోసం ఉపయోగించడం, చట్టం అనుమతించని విధంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి సందర్భాల్లో మోటారు వాహనాల చట్టంలోని కొన్ని నిబంధనలు వర్తించే అవకాశం ఉంటుంది. ఈ ఘటనలో పోలీసులు ఏ పరిస్థితుల్లో ఆ సెక్షన్‌ను అమలు చేశారన్న దానిపై మాత్రం మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఒక చిన్న మానవతా చర్య… ఒక భారీ జరిమానా… ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది. లిఫ్ట్ ఇవ్వాలా… వద్దా…? అనే సందేహాన్ని ఈ ఘటన వాహనదారుల ముందుకు తెచ్చింది.