GHMC | జుట్టు పట్టుకుని కొట్టిన మహిళ..
GHMC | జుట్టు పట్టుకుని కొట్టిన మహిళ..
నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ హెచ్చరిక
GHMC | ఆంధ్రప్రభ, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని దీనబంధు కాలనీలో శనివారం పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి జరిగిన ఘటన వెలుగుచూసింది.
వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్ సమీపంలో ఏపీ 40 ఎల్ క్యూ 1896 నంబర్ గల వాహనంలో వచ్చిన దంపతులు రోడ్డుపై చెత్త పారవేస్తుండగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వారిని అడ్డుకుని చెత్త వేయవద్దని సూచించారు.
దీంతో ఆగ్రహానికి గురైన మహిళ పారిశుద్ధ్య కార్మికురాలితో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ఆమె జుట్టు పట్టుకుని కొట్టినట్లు సమాచారం. అక్కడే ఉన్న మరో పారిశుద్ధ్య కార్మికుడు ఈ ఘటనను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి స్పందిస్తూ… వాహనం నంబర్ ఆధారంగా నిందితురాలిని గుర్తించామని తెలిపారు. ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
