జర్మనీ కొలువులకు మందమర్రిలో శిక్షణ

జర్మనీ కొలువులకు మందమర్రిలో శిక్షణ

  • జూన్ 10 నుంచి శిక్షణ తరగతులు
  • మందమర్రిలో శిక్షణా శిబిరం ప్రారంభం: మంత్రి వివేక్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ సహకారంతో మందమర్రిలో ఏర్పాటు చేసిన “జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్” ను రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు. స్థానిక స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ ద్వారా స్థానిక యువతకు జర్మనీలో ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే టామ్‌కామ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

జర్మనీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జూన్ 10, 2026 నుండి ప్రత్యేక శిక్షణ తరగతులుప్రారంభమవుతాయనివెల్లడించారు. విదేశీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యంపెంపొందించేందుకు టామ్‌కామ్ వద్ద అన్ని మౌలిక వసతులు, నిపుణులైన శిక్షకులు, తగిన బడ్జెట్ అందుబాటులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమాల అమలులో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చూపుతున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యానికి, ప్రత్యేకించి సి.ఎం.డి. బుద్ధ ప్రకాష్ జ్యోతి, మందమర్రి ఏరియా జి ఎం రాధాకృష్ణకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జి. ఎం. ఎన్. రాధాకృష్ణ, ఎం ఆర్ ఓ సతీష్ కుమార్, డీజీఎం పర్సనల్ అశోక్, జి ఎం వి టి సి మేనేజర్ శ్రీధర్, టామ్‌కామ్ మేనేజర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply