ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ పిలుపు
వినుకొండలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన జీవీ ఆంజనేయులు
వినుకొండ, ఆంధ్రప్రభ: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
వినుకొండ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జీవీ ఆంజనేయులు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పోలియో రహిత రాష్ట్రం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రెండు పోలియో చుక్కలతో పిల్లలను అంగవైకల్యం నుంచి రక్షించవచ్చని పేర్కొన్నారు.
ఇంటింటికి వెళ్లి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి నూరుశాతం పోలియో చుక్కలు వేయాలని వైద్యాధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
