PV Narasimha Rao | దేశాన్ని మార్చిన నిశ్శబ్ద వ్యూహాలు..!
PV Narasimha Rao | దేశాన్ని మార్చిన నిశ్శబ్ద వ్యూహాలు..!
PV Narasimha Rao | అపర చాణక్యుడు.. బహుభాషా కోవిదుడు
దేశ గమనాన్ని మార్చిన ఆర్థిక సంస్కరణలు
నేడు పీవీ నరసింహారావు జయంతి
PV Narasimha Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పాములపర్తి వెంకట నరసింహారావు.. ఈ పేరు వినబడగానే ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక అపారమైన మేధో సంపత్తి కళ్లముందు కదలాడుతాయి. బహుభాషా కోవిదుడిగా, రాజనీతిజ్ఞుడిగా, భారత ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుండి గట్టెక్కించిన అపర చాణక్యుడిగా ఆయన చూపిన జ్ఞాన ఠీవి ప్రపంచ యవనికపై భారతదేశ కీర్తిని సగర్వంగా నిలబెట్టింది.
తెలంగాణ మట్టిలో పుట్టి, విశ్వవ్యాప్త ఖ్యాతి గడించిన పీవీ నరసింహారావు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ఆయన ఒక నడిచే గ్రంథాలయం. పదిహేనుకు పైగా భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే, రాయగలిగే అద్భుత భాషా నైపుణ్యం ఆయన సొంతం. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకోవడం ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనం. కంప్యూటర్లు సరిగ్గా రాని కాలంలోనే, తన అరవై ఏళ్ల వయసులో కోడింగ్ నేర్చుకుని సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లు రాసిన నిత్య విద్యార్థి ఆయన.
1991లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, మైనారిటీ ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, తన రాజకీయ చతురతతో ఐదేళ్ల పూర్తికాలాన్ని విజయవంతంగా ముగించారు. నెహ్రూ కాలం నాటి ‘లైసెన్స్ రాజ్’ విధానాలకు స్వస్తి పలికి, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలను ధైర్యంగా ప్రవేశపెట్టారు. లుక్ ఈస్ట్ (తూర్పు దేశాల వైపు చూపు) విధానం ద్వారా విదేశాంగ విధానంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. అణుబాంబు పరీక్షలకు పునాది వేసి, దేశ రక్షణ రంగానికి సరికొత్త దిశను చూపారు. అందుకే ఆయనను భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు అని పిలుచుకుంటాం.
పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయే తప్ప, ఆయన ఎన్నడూ పదవుల కోసం ప్రాకులాడలేదు. నిశ్శబ్దంగా ఉంటూనే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే మౌన ముని ఆయన. భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఆ ధీశాలికి దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ దక్కడం ప్రతి తెలుగువాడికి గర్వకారణం. పీవీ కేవలం ఒక చారిత్రక పురుషుడు కాదు, భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఒక మహోన్నత జ్ఞాన శిఖరం.
