Donald Trump | డీఎస్‌టీ విధించే దేశాలపై ట్రంప్ కఠిన హెచ్చరిక
Donald Trump | డీఎస్‌టీ విధించే దేశాలపై ట్రంప్ కఠిన హెచ్చరిక
Donald Trump | వాణిజ్య ఒప్పందాల రద్దుకు అమెరికా సిద్ధం
డిజిటల్ సేవల పన్నులపై అమెరికా అభ్యంతరం
Donald Trump | వాషింగ్టన్ : అమెరికన్ కంపెనీలపై డిజిటల్ సేవల పన్ను (డీఎస్‌టీ)ని వేసే దేశాల దిగుమతులపై తాము 100 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇలాంటి పన్ను విధించే దేశాలపై ప్రస్తుతం ఉన్న లేదా భవిష్యత్తులో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టారు. డిజిటల్ సేవల పన్ను విధించే దేశాలు అమెరికా నుంచి తక్షణ వాణిజ్య ప్రతీకారాన్ని ఎదుర్కొంటాయని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ సేవల పన్ను విధించే దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను, అవి అమలు చేయబడినా, సంతకం చేసినప్పటికీ, ఇంకా సంతకాలు చేయనప్పటికీ వాటిని రద్దు చేస్తామన్నారు. ప్రతిపాదిత జరిమానాల నుంచి ప్రస్తుత ఒప్పందాలు ఆయా దేశాలను రక్షించలేవని చెప్పారు. యూరోపియన్ దేశాలను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాలు అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై డిజిటల్ సేవల పన్నులను తక్షణమే అమలు చేయడం గురించి చర్చిస్తున్నాయని చెప్పారు.
అమెరికన్ కంపెనీలపై డిజిటల్ సేవల పన్నును తక్షణమే అమలు చేయడంపై పలు యూరోపియన్ దేశాలు చర్చిస్తున్నాయని, ఈ దేశాలలో కొన్ని వాస్తవానికి దీనిని అమలు చేయడానికి నిర్ణయించుకున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ దేశాలు పన్ను విధించాలని నిర్ణయిస్తే తక్షణమే 100 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ఆయన హెచ్చరించారు.
డిజిటల్ సేవల పన్నులు అంటే…
డిజిటల్ ప్రకటనలు, మార్కెట్ ప్లేస్‌లు, వినియోగదారుల డేటా వంటి ఆన్‌లైన్ సేవల నుంచి పెద్ద టెక్నాలజీ కంపెనీలు సంపాదించే ఆదాయాలపై కొన్ని దేశాలు ఈ పన్ను విధిస్తున్నాయి. అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థలను ఈ పన్నులు అసమానంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయని వాదిస్తున్న అమెరికా వీటిని వ్యతిరేకిస్తోంది.
