RE-NEET 2026 | నీట్ ప్రాథమిక కీ విడుదల..
- జూన్ 28 వరకు ఆన్లైన్లో అభ్యంతరాల స్వీకరణ
- త్వరితగతిన ఫలితాల విడుదలకు ఎన్టీఏ ప్రత్యేక చర్యలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించిన ప్రాథమిక కీ (ప్రొవిజనల్ ఆన్సర్ కీ)ని గురువారం విడుదల చేసింది. జూన్ 21న నిర్వహించిన నీట్ రీ-ఎగ్జామ్‌కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీని పరిశీలించవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షకు సంబంధించిన నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలను nta.ac.in వెబ్సైట్లో, ప్రాథమిక ఆన్సర్ కీని neet.nta.nic.inలో అందుబాటులో ఉంచారు.
ఈసారి పారదర్శకతను పెంచడంతో పాటు ఫలితాలను త్వరగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తికాకముందే ఆన్సర్ కీని విడుదల చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను నిపుణుల కమిటీ సమాంతరంగా పరిశీలించడం ద్వారా తుది కీ, ఫలితాలను వేగంగా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
జూన్ 28 వరకు అవకాశం..
అభ్యర్థులు జూన్ 28 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. ఈ-మెయిల్, పోస్టు లేదా ఫ్యాక్స్ ద్వారా పంపే అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు. ప్రతి ప్రశ్నపై అభ్యంతరం నమోదు చేయడానికి రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు తమకు వచ్చిన ప్రశ్నపత్రం సిరీస్ కోడ్ ఆధారంగానే అభ్యంతరాలు నమోదు చేయాలని ఎన్టీఏ సూచించింది. నిపుణుల కమిటీ ఏదైనా అభ్యంతరాన్ని సమర్థిస్తే, ఆ ప్రశ్నకు సంబంధించిన ఫీజును పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. అలాగే ఆ మార్పు అన్ని ప్రశ్నపత్రాల సెట్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఓఎంఆర్ షీట్లు తర్వాతే
ప్రస్తుతం ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతున్నందున వ్యక్తిగత ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లు ఈ దశలో అందుబాటులో ఉండవని ఎన్టీఏ తెలిపింది. స్కానింగ్ పూర్తయిన అనంతరం అభ్యర్థులు తమ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను పరిశీలించే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం నిపుణుల కమిటీ ఖరారు చేసే తుది ఆన్సర్ కీనే అంతిమంగా పరిగణిస్తామని, ఆ తర్వాత ఎలాంటి ఫిర్యాదులను స్వీకరించబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది.
