Anant Ambani | శ్రీ‌వారి సేవ కోసం 25 ఎలక్ట్రిక్ బస్సులు

Anant Ambani | శ్రీ‌వారి సేవ కోసం 25 ఎలక్ట్రిక్ బస్సులు

బ‌స్సుల విలువ రూ.27.5 కోట్లు
డ్రైవర్ల జీతభత్యాలను కూడా భరించనున్న రిలయన్స్ సంస్థ
తిరుమలలో చార్జింగ్ స్టేషన్లు, గోశాల ఆధునీకరణకు సహకారం ప్రకటించిన అనంత్ అంబానీ

Anant Ambani | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ, ఆయన సతీమణితో కలిసి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీకి పలు సేవా కార్యక్రమాల కోసం భారీ విరాళాలను ప్రకటించారు. టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనున్నట్లు అనంత్ అంబానీ తెలిపారు. అంతేకాకుండా, ఈ బస్సుల నిర్వహణ కోసం అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే భరిస్తుందని వెల్లడించారు.

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా సహకరిస్తామని ఆయన తెలిపారు. అలాగే, గుజరాత్‌లోని వంతారా నమూనాలో తిరుమల గోశాలను ఆధునీకరించేందుకు టీటీడీతో కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ దంపతులకు ఆలయ అధికారులు, వేదపండితులు వేదాశీర్వచనాలతో స్వాగతం పలికి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంత్ అంబానీ ప్రకటించిన విరాళాలు తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన రవాణా, గోసంరక్షణ సేవలు అందించడంలో కీలకంగా మారనున్నాయి.