సోని విజన్ చోరీ ఘటనపై పోలీస్ కమిషనర్ దర్యాప్తు

సోని విజన్ చోరీ ఘటనపై పోలీస్ కమిషనర్ దర్యాప్తు

ఖమ్మం, (ఆంధ్రప్రభ): నగరంలోని ప్రముఖ మొబైల్ విక్రయ కేంద్రం ‘సోని విజన్’ షోరూమ్‌లో జరిగిన చోరీ ఘటనపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. షోరూమ్‌లో జరిగిన చోరీ వివరాలను యాజమాన్యం, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గుర్తుతెలియని దుండగులు షాపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, స్టాక్‌రూమ్‌లో భద్రపరిచిన విలువైన అధునాతన మొబైల్ ఫోన్లను చోరీ చేసినట్లు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని అధికారులకు సూచించారు. చోరీ వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తుండగా, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ సందర్భంగా నగర ఏసీపీ రమణమూర్తి, వన్‌టౌన్ సీఐ కరుణాకర్, క్లూస్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply