రెండే చుక్కలతో పోలియో దూరం…

మండల వైద్యాధికారి రాధాకృష్ణన్

శావల్యాపురం, ఆంధ్రప్రభ : నిండు జీవితానికి రెండే చుక్కలతో పోలియో బారిన పడకుండా ఉండొచ్చని మండల వైద్యాధికారి డాక్టర్ మాన్యం రాధాకృష్ణన్ అన్నారు. మండలంలోని కనమర్లపూడి, శావల్యాపురం, మతుకుమల్లి గ్రామాలలో వైద్యాధికారులు రాధాకృష్ణన్, రెండవ వైద్యాధికారిని రావిపూడి రమ్య పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో బారిన పడకుండా రక్షించుకోవాలన్నారు.

మండలంలోని అన్ని గ్రామాలలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల పర్యవేక్షణలో పోలియో చుక్కల కార్యక్రమం జరిగిందన్నారు. మండల వ్యాప్తంగా 3049 మంది పిల్లలకు గాను 2897 మందికి చుక్కలు వేయడం జరిగిందన్నారు. ఆదివారం రోజున 95 శాతం పూర్తయిందని, మిగిలిన 152 మంది పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి నూరు శాతం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
డాక్టర్ రమ్య మాట్లాడుతూ జలుబు, దగ్గు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పోలియో చుక్కలు వేయించవచ్చు అని తెలియజేశారు. సూపర్వైజర్స్ ఏడుకొండలు, ఉమాదేవి, నారాయణమ్మ, ఆశాలు, అంగన్వాడీలు, వాలంటీర్స్ పాల్గొన్నారు.