Food Safety | ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడిన నిజాలు!
Food Safety | ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడిన నిజాలు!
Food Safety | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. నగరంలోని హైటెక్‌సిటీలో ఉన్న మెహెఫిల్ రెస్టారెంట్, గచ్చిబౌలిలోని షా గౌస్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మెహెఫిల్ రెస్టారెంట్‌లో పలు లోపాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వంటశాలలో అపరిశుభ్రమైన వాతావరణం, తడిగా ఉన్న నేల, సరైన విధంగా నిల్వ చేయని గ్రిల్ చికెన్, నిర్మాణ పనులకు సంబంధించిన సామగ్రి పక్కనే రుమాలీ రోటీలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలను పాటించడంలో నిర్లక్ష్యం కనిపించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అదే విధంగా గచ్చిబౌలిలోని షా గౌస్ రెస్టారెంట్‌లో కూడా పరిశుభ్రతకు సంబంధించిన పలు లోపాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వంటశాల నిర్వహణ, ఆహార నిల్వ విధానాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో గుర్తించిన లోపాలపై సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలోనే ఇలాంటి పరిస్థితులు బయటపడటంతో వినియోగదారుల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హోటల్ యాజమాన్యాలను హెచ్చరించినట్లు సమాచారం.
