డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. విద్యార్థులకు న్యాయ అవగాహన
పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించిన న్యాయ నిపుణులు
కొత్తగూడెం (లీగల్), ఆంధ్రప్రభ: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎం. రాజేందర్ ఆదేశాల మేరకు పారాలీగల్ వాలంటీర్లు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ అడ్వకేట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, సామాజిక, వ్యక్తిగత దుష్పరిణామాలపై ఆయన వివరంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా మలచుకోవాలని సూచించారు. అలాగే పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టంలోని ముఖ్య నిబంధనలను వివరించి, పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 టోల్‌ఫ్రీ నంబర్ సేవల గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు పల్నాటి శ్రీవీణారాణి, పల్నాటి ప్రశాంత్, తులసి, జి. భవాని, ఇసన్నపల్లి నాగరాజు, చైల్డ్ హెల్ప్‌లైన్-1098 ప్రతినిధులు సారిక, భవాని, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
