Blue Horizon Guardian | భారత ప్రజలకే అంకితం: మోదీ
Blue Horizon Guardian | భారత ప్రజలకే అంకితం: మోదీ
● సెయిషెల్స్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలు
● భారత్–సెయిషెల్స్ 50 ఏళ్ల స్నేహ బంధం మరింత బలోపేతమైందన్న మోదీ
Blue Horizon Guardian | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సెయిషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ బిరుదుతో తనను సత్కరించడం తనకే కాకుండా భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు దక్కిన గౌరవమని అన్నారు. ఈ గౌరవాన్ని వినయపూర్వకంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్న మోదీ.. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను భావితరాల పట్ల బాధ్యతగా భావిస్తున్న ప్రపంచ దేశాలన్నింటికీ ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
సెయిషెల్స్ స్వాతంత్ర్యానికి 50 ఏళ్లు పూర్తైన చారిత్రాత్మక సందర్భంగా తన పర్యటన జరుగుతుండటం ఆనందంగా ఉందని మోదీ చెప్పారు. ఇదే సమయంలో భారత్–సెయిషెల్స్ దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. గత ఐదు దశాబ్దాల్లో ఇరు దేశాల మధ్య స్నేహం విశ్వాసంగా, విశ్వాసం సహకారంగా, సహకారం ప్రజా సంక్షేమంగా రూపాంతరం చెందిందని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాలుగా హిందూ మహాసముద్రం భారత్–సెయిషెల్స్ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తూ, వాణిజ్యం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంపొందించిందని మోదీ వివరించారు.
