US Iran Deal | శాంతి ఒప్పందం దిశగా అమెరికా-ఇరాన్ చర్చలు

US Iran Deal | శాంతి ఒప్పందం దిశగా అమెరికా-ఇరాన్ చర్చలు

US Iran Deal | ఇరాన్‌కు 60 రోజుల ఆంక్షల మినహాయింపు
హార్ముజ్ జలసంధిలో మళ్లీ నౌకాయానం
అణు కార్యక్రమంపై ట్రంప్ హెచ్చరిక
పాకిస్తాన్ పర్యటనలో ఇరాన్ అధ్యక్షుడు

US Iran Deal | వాషింగ్టన్/దుబాయి: ఇరాన్‌కు భారీ ఊరట కల్పిస్తూ అమెరికా 60 రోజుల పాటు ఆంక్షలు ఎత్తివేసింది. కొత్తగా ఏర్పడుతున్న శాంతి ఒప్పందం కింద స్విట్జర్లాండ్‌లో జరిగిన తొలి చర్చ అనంతరం అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలో అంగీకరించినట్లుగా తన మాటకు ఇరాన్ కట్టుబడి ఉండకపోతే “నేను చేయవలసింది చేస్తాను” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

స్విట్జర్లాండ్‌లో ఇరాన్ అధికారులతో జరిపిన చర్చలు తుది శాంతి ఒప్పందానికి మంచి పునాది వేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అన్నారు. మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం తరువాత గత వారం కుదుర్చుకున్న మధ్యంతర ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో, స్విట్జర్లాండ్‌లోని బ్యూరెన్‌స్టాక్ పర్వత ప్రాంతంలో జరిగిన చర్చల్లో 60 రోజుల్లోగా శాశ్వత ఒప్పందం దిశగా ఒక కార్యాచరణ ప్రణాళికకు ఇరు పక్షాలు అంగీకరించాయని మధ్యవర్తులైన పాకిస్థాన్, ఖతార్ తెలిపాయి.

ఈ సందర్భంగా అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్, లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మధ్య జరుగుతున్న పోరాటాన్ని ముగించేందుకు ఒక యంత్రాంగానికి కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. చర్చల్లో మంచి పురోగతి సాధించబడినట్లు ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అలీ బహ్రెయిని పేర్కొన్నారు.

ఆంక్షల తొలగింపు, ఇరాన్ అణు కార్యకలాపాలపై దృష్టి సారించడానికి రాబోయే రోజుల్లో రెండు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అణు సమస్యపై, అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఈఏ) పాత్రపై చర్చలు ప్రారంభించడానికి ముందు, ప్రాథమిక ఒప్పందంలోని ఐదు భాగాలను పూర్తిగా అమలు చేయవలసి ఉందని ఆయన విలేకరులతో అన్నారు.

అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందంలో లెబనాన్ ఒక నిస్సందేహమైన భాగమని, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ కూడా అందులో భాగంగా ఉందని బహ్రెయిని తెలిపారు. ప్రపంచ చమురు సరఫరాలకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఒక కమ్యూనికేషన్ మార్గాన్ని కూడా ప్రారంభించారు.

ఆగస్టు 21 వరకు ఊరట

ఇరాన్‌కు ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు కుదిరిన ఒప్పందంలో భాగంగా, మొదటిగా అమెరికా ట్రెజరీ ఆగస్టు 21 వరకు ఆంక్షలపై మినహాయింపును ప్రకటించింది. దీనితో ఇరాన్ చమురు, కమ్యూనికేషన్ సంబంధిత ఉత్పత్తులను విక్రయించి, వాటికి చెల్లింపులు స్వీకరించడానికి వీలు కలిగింది.

ఈ 60 రోజుల వ్యవధిలో చైనా ప్రభుత్వ, స్వతంత్ర రిఫైనరీలు ఇరాన్ చమురు కొనుగోళ్లను పెంచే అవకాశం ఉంది. ఈ చర్య గల్ఫ్‌లో నిలిచిపోయిన సుమారు 6.7 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు నిల్వలను విడుదల చేసి, ఇరాన్‌కు భారీ ఆర్థిక లాభాన్ని చేకూర్చనుంది. చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులకు మినహాయింపులు, స్తంభింపజేసిన కొన్ని ఆస్తుల విడుదల వంటి వాటిని తాము సాధించుకున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో తెలిపారు.

నేను చేయవలసింది చేశా: ట్రంప్

అణు కార్యక్రమం పట్ల తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇరాన్ ఆయుధ తనిఖీలకు అంగీకరిస్తుందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. “ఒకవేళ ఇరాన్ తమ ఒప్పందాన్ని పాటించకపోయినా, లేదా సరిగ్గా ప్రవర్తించకపోయినా నేను చేయవలసింది చేస్తాను” అని ట్రంప్ ఆ తరువాత విలేకరులతో అన్నారు. అంగీకరించిన వాటి పట్ల పూర్తి నిబద్ధత, వాటిని కచ్చితంగా అమలు చేయడంపైనే చర్చల ప్రభావం ఆధారపడి ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మంగళవారం ఎక్స్‌లో పేర్కొన్నారు.

అణు చర్చలు జరగలేదు: ఇరాన్

తమ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించినట్లు గానీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తనిఖీదారులను తమ దేశానికి ఆహ్వానించడానికి అంగీకరించినట్లు గానీ ఇరాన్ తెలుపలేదు. ఇందుకు సంబంధించి తాము అంగీకరించినట్లు వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది.

స్విట్జర్లాండ్‌లో ఐఏఈఏ అధిపతి రాఫెల్ గ్రోస్సీతో ఇరాన్ అధికారులు సమావేశం కాలేదని, అలాగే దెబ్బతిన్న ఇరాన్ అణు కర్మాగారాలను ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ తనిఖీ చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మంగళవారం తెలిపారు.

పాక్‌లో ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంలోని అన్ని నిబంధనల పూర్తి అమలు, అలాగే పరస్పర ప్రయోజనం ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మంగళవారం ఒక రోజు పర్యటన నిమిత్తం పాకిస్తాన్ చేరుకున్నారు. ఆయన ఇస్లామాబాద్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి చేరుకోగా, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

హార్మూజ్ నుంచి ఒక్క రోజే 1.9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంతో హార్మూజ్ జలసంధిలో నౌకాయానం తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఒక్క రోజే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ముడి చమురు ధరలు పడిపోతున్నాయని, ప్రపంచం సురక్షితమైన ప్రదేశంగా మారిందని ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భవిష్యత్తులో అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. భారత్ జెండాలు ఉన్న 11 నౌకలు హార్మూజ్ జలసంధిని దాటినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.