AI Impact | భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో ఈసీఈ ప్రాధాన్యం
AI Impact | భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో ఈసీఈ ప్రాధాన్యం
AI Impact | ఇంజనీరింగ్ ప్రవేశాల్లో మారుతున్న విద్యార్థుల అభిరుచులు
ఈసీఈ వైపు పెరుగుతున్న ఆకర్షణకు కారణాలివే
సెమీకండక్టర్, ఏఐ విప్లవంతో ఈసీఈకి బంగారు భవిష్యత్
తెలుగు రాష్ట్రాల్లో ఈసీఈ సీట్లకు భారీ డిమాండ్
AI Impact | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఇంజనీరింగ్ విద్యలో ఎవరూ ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. గత ఏడాది వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్-ఐటీ) వంటి బ్రాంచ్‌లకే పరిమితమైన విద్యార్థుల ఆకర్షణ ఇప్పుడు వేగంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ వైపు మళ్లుతోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈసీఈ సీట్లకు భారీ పోటీ ఏర్పడనున్నదని సాంకేతిక విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరిశ్రమల వర్గాలు ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఈసీఈని భవిష్యత్ సాంకేతిక రంగానికి కేంద్రబిందువుగా చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇంజనీరింగ్‌లో ఈసీఈ బ్రాంచ్‌ను మధ్యస్థ కోర్సుగా చూసేవారు. కంప్యూటర్ సైన్స్‌లో సీటు రాకపోతే తీసుకునే ప్రత్యామ్నాయ కోర్సుగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇందుకు కారణం ప్రపంచ సాంకేతిక రంగంలో వచ్చిన భారీ మార్పులు.
కృత్రిమ మేధస్సు (ఏఐ), చిప్ తయారీ, సెమీకండక్టర్ పరిశ్రమ, 5జీ, 6జీ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఎలక్ట్రిక్ వాహనాలు—ఇవన్నీ ఈసీఈకి నేరుగా సంబంధిత రంగాలు. ఈ కారణంగా ఈ శాఖకు ఉద్యోగ అవకాశాలు భారీగా విస్తరించాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెమీకండక్టర్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం కూడా ఈసీఈ కోర్సు డిమాండ్ పెరగడానికి కీలక కారణంగా మారిందని చెబుతున్నారు. దేశంలో చిప్ తయారీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి. గుజరాత్, అస్సాం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ఇక్కడ వందలాది మంది ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ సంస్థలు కూడా భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ రంగానికి ప్రధానంగా అవసరమయ్యే మానవ వనరులు ఈసీఈ విద్యార్థులే కావడంతో ప్రస్తుతం జరుగుతున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ శాఖను ఎంపిక చేసుకునేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. దీంతో ఈసీఈ కోర్సుకు ఈ ఏడాది విపరీతమైన డిమాండ్ పెరిగిందని అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జేఈఈ, రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఈసీఈ కటాఫ్‌లు గత మూడు సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి. అనేక జాతీయ స్థాయి సాంకేతిక విద్యాసంస్థల్లో ఈసీఈ కటాఫ్‌లు కంప్యూటర్ సైన్స్ తర్వాత రెండో స్థానానికి చేరాయి. కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఈసీఈ సీట్లు మొదటి విడతలోనే భర్తీ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన టాప్ కళాశాలల్లో ఈసీఈ సీట్లకు గతంతో పోలిస్తే 20 నుంచి 35 శాతం వరకు డిమాండ్ పెరిగినట్లు విద్యాసంస్థలు చెబుతున్నాయి. కొన్ని కళాశాలల్లో ఈసీఈ విద్యార్థుల ప్రాంగణ నియామకాల వేతన ప్యాకేజీలు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో సమానంగా నమోదవుతున్నాయి.
ఏఐ విప్లవం కూడా ఈసీఈకు మేలు చేసింది. ఎందుకంటే ఏఐ వ్యవస్థలు పనిచేయడానికి భారీ కంప్యూటింగ్ చిప్స్, ప్రాసెసర్లు, సెన్సర్లు, హార్డ్‌వేర్ కమ్యూనికేషన్ వ్యవస్థలు అవసరం. ఈ రంగాల్లో ఈసీఈ నిపుణుల అవసరం బాగా పెరిగింది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే ప్రధాన లక్ష్యంగా ఉండగా, ఇప్పుడు హార్డ్‌వేర్-సాఫ్ట్‌వేర్ కలయిక నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది. అందుకే ఈసీఈ విద్యార్థులు ఇప్పుడు కోడింగ్‌తో పాటు ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్ఎస్ఐ, చిప్ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు పొందుతున్నారు.

ఈ తరం విద్యార్థులు ఒకే రంగంపై ఆధారపడే పరిస్థితిని నివారించేందుకు చూస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల మధ్య పెరుగుతున్న పోటీ, ఐటీ రంగంలో ఆటోమేషన్ ప్రభావం కారణంగా బహుళ అవకాశాలు ఉన్న శాఖగా ఈసీఈను ఎంపిక చేసుకుంటున్నారు. ఈసీఈ చదివిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగంలోకి కూడా వెళ్లవచ్చు. చిప్ డిజైన్ రంగంలో ఉద్యోగాలు పొందవచ్చు. టెలికాం రంగంలో అవకాశాలు పొందవచ్చు. రక్షణ, అంతరిక్ష, ఆటోమొబైల్ రంగాల్లో పనిచేయవచ్చు. ఉన్నత విద్యలో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ వైపు మళ్లవచ్చు. ఈ విస్తృత అవకాశాలే ఈసీఈ కోర్సుకు బలం చేకూరుస్తున్నాయి.
ఈసీఈకే తెలుగు రాష్ట్రాల జై
తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గత రెండు విద్యా సంవత్సరాలుగా ఈసీఈ సీట్లకు భారీ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈసీఈ శాఖ మళ్లీ ప్రాధాన్యం పొందుతోంది. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్, చిప్ డిజైన్, రక్షణ పరిశ్రమలకు చెందిన సంస్థలు విస్తరిస్తుండటం కూడా దీనికి కారణం. అనేక సంస్థలు కళాశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ వర్సిటీలతో పాటు జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో గత ఏడాది ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈసీఈ సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయని చెబుతున్నారు. జాతీయ స్థాయిలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలలోనూ ఈసీఈ సీట్ల భర్తీ అంచనాలకు భిన్నంగా జరిగిందని పేర్కొంటున్నారు. విద్యారంగ నిపుణులు, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో కేవలం కోడింగ్ సరిపోని పరిస్థితి ఏర్పడవచ్చని చెబుతున్నారు. హార్డ్‌వేర్ అవగాహన, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులకు మరింత అవకాశాలు లభిస్తాయని విశ్లేషిస్తున్నారు.
కొంతమంది నిపుణులు అయితే ఈసీఈ కొత్త యుగపు మల్టీడిసిప్లినరీ కోర్సుగా మారుతోందని చెబుతున్నారు. అంటే ఒకే సమయంలో కంప్యూటింగ్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఏఐ రంగాలకు అనుసంధానమయ్యే శాఖగా ఇది ఎదుగుతోందని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగం వేగంగా విస్తరిస్తుండటం, భారత్ చిప్ తయారీ కేంద్రంగా ఎదగాలని ప్రయత్నించడం, 6జీ సాంకేతికతపై పరిశోధనలు ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల్లో ఈసీఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే నిపుణులు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. కేవలం శాఖ ఎంపికతో ఉద్యోగం రాదని, కొత్త సాంకేతిక నైపుణ్యాలు, ముఖ్యంగా కోడింగ్, చిప్ డిజైన్ టూల్స్, ఏఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకున్నప్పుడే మంచి అవకాశాలు దక్కుతాయని సూచిస్తున్నారు.
