24thJuneeditorial | ఎల్‌నినో ప్రభావంతో తగ్గుతున్న వర్షాలు

24thJuneeditorial | ఎల్‌నినో ప్రభావంతో తగ్గుతున్న వర్షాలు

24thJuneeditorial | ఖరీఫ్ పంటలపై ముప్పు.. రైతుల్లో ఆందోళన
ప్రభుత్వాల ముందస్తు ప్రణాళికల లోపం
రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యల అవసరం
దీర్ఘకాలిక వ్యవసాయ ప్రణాళికలే పరిష్కారం

24thJuneeditorial | పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం, అలాగే హిందూ మహాసముద్రంలో కూడా ఆ ప్రభావం కనిపించడంతో ఈ ఏడాది భారత్పై కరువు ప్రభావం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇప్పటికే పలు హెచ్చరికలు వచ్చాయి. నైరుతి రుతుపవనాలు కొద్దిగా ఆలస్యంగానైనా భారత్లో ప్రవేశించడంతో ఊపిరి పీల్చుకున్న భారత రైతాంగం ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించినా వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో కురవడం లేదు. ఇందుకు కారణం ఎల్‌నినో ప్రభావమేనని ఐఎండీ స్పష్టం చేసింది.

దాదాపు రెండు వారాలు నైరుతి రుతుపవనాల్లో విరామం వచ్చింది. అక్కడక్కడ చెదురుమదురు జల్లులు తప్ప నేల పదునెక్కే స్థాయిలో వర్షాలు పడలేదు. ఇక ఈ ఏడాది భారత్కు పెను సవాల్ సిద్ధంగా ఉందని తేలిపోయింది. సాధారణ వర్షపాతం కంటే పది శాతం తక్కువ ఉండవచ్చునని తొలుత భారత వాతావరణ శాఖ ప్రకటించినా, అంచనాలు దారుణంగా తప్పే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది.

ఇప్పటికే దేశంలో పలుచోట్ల తాగునీటి ఎద్దడి మొదలైంది. ఇక ఖరీఫ్ పంటల దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదం కళ్లెదుట కనిపిస్తోంది. ఇది ఆహార భద్రతపై తక్షణ ప్రభావం చూపించకపోయినా ప్రమాదఘంటికలను మోగిస్తోంది. 2002, 2009, 2015-16లలో వచ్చిన ఎల్‌నినో కంటే ప్రస్తుత గాడ్జిల్లా ఎల్‌నినో మరింత శక్తిమంతంగా ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సీజన్‌లో సాగు చేసే వరి, మొక్కజొన్న పంటల దిగుబడి దాదాపు 60 శాతం తగ్గిపోవచ్చునని అంచనా వేస్తుండగా, రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధిని సూచిస్తోంది.

వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా ఎల్‌నినో ముంచుకొస్తుందని మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం విచారకరం. సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ తాత్కాలిక కంటితుడుపు చర్యలు తీసుకోవడం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడమే.

భారత వాతావరణ శాఖ హెచ్చరికలకు ఇప్పటికైనా తక్షణం స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. రైతులకు కావాల్సిన విత్తనాలను సబ్సిడీపై అందించాలి. బీమా సౌకర్యం గ్రామ యూనిట్‌గా ప్రతి రైతుకు కల్పించాలి. డ్రిప్, స్ప్రింక్లర్లు, ఇతర ఇరిగేషన్ సబ్సిడీలను తక్షణం అందించాలి. కరువును తట్టుకునే జొన్న, సజ్జ, రాగి తదితర ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి.

జలాశయాలలో నీటి మట్టాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగా తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎల్‌నినోను కూడా ప్రకృతి వైపరీత్యంగానే ప్రభుత్వాలు గుర్తించి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించాలి.

సంక్షోభాలు వచ్చినప్పుడు కాకుండా ప్రతి ఏటా ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల ప్రణాళికను ప్రకటించాలి. రైతులు, దళారులు లేదా మిల్లర్ల ఇష్టాయిష్టాలకు వదిలివేయకుండా ఏయే రాష్ట్రం, ప్రాంతాలలో భూసారాలను బట్టి ఏయే పంటలను ఎంత విస్తీర్ణంలో వేయాలో ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. అప్పుడే రైతాంగానికి గిట్టుబాటు ధర లభించడమే కాకుండా, వ్యవసాయంపై పూర్తి భరోసా ఏర్పడుతుంది. కేవలం కొంత నగదును పెట్టుబడి సాయంగా రైతు భరోసా అంటూ అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.