India US Trade Deal | భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు శ్రీకారం

India US Trade Deal | భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు శ్రీకారం

India US Trade Deal | ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి తుది రూపు
సుంకాల తగ్గింపుపై పరస్పర అంగీకారం
అమెరికా సుంకాల మార్పులతో కొత్త సమీక్ష
301 విచారణపై భారత ఆందోళనలు

India US Trade Deal | న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) చర్చలు మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జెమిసన్ గ్రీర్ భారత్‌కు వచ్చారు. ఈ చర్చల్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, జెమిసన్ గ్రీర్ పాల్గొంటున్నారు. వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయం వాణిజ్య భవన్‌లో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి.

ఈ చర్చల్లో వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత ప్రధాన చర్చల ప్రతినిధి, వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్బణ్ జైన్, అమెరికా వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జూన్ 2-4 వరకు ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. దీని తరువాత తాజాగా మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి తుది రూపు ఇవ్వడంపై ఇద్దరు మంత్రుల మధ్య ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.

వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా రెండు దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయని జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను పరిష్కరించడానికి భారత్, అమెరికా కృషి చేస్తున్నాయని, ఈ నెల మధ్య నాటికి అత్యంత చైతన్యవంతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను అమలు చేసే అవకాశం ఉందని పీయూష్ గోయల్ చెప్పారు.

ముసాయిదాపై పరస్పర అంగీకారం..

పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ఆధారంగా తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి విధానపరమైన ముసాయిదాపై అంగీకారం కుదిరినట్లు భారత్, అమెరికా ఫిబ్రవరి 7నే ప్రకటించాయి. అప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారం భారత వస్తువులపై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి కుదించేందుకు అమెరికా అంగీకరించింది. అదే సమయంలో ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేసింది.

దీంతో భారత్, అమెరికా మధ్య అంగీకారం కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం నిలిచిపోయింది. కోర్టు సుంకాలను కొట్టివేసిన తరువాత అన్ని దేశాలపై 10 శాతం బేస్ సుంకాలను 150 రోజుల పాటు అమల్లో ఉండేలా విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాల గడువు జులై 24తో ముగుస్తుంది. అమెరికా సుంకాల్లో వచ్చిన మార్పుల మూలంగా ఒప్పందంలోని పలు అంశాలను సమీక్షించాల్సి ఉంటుంది. 10 శాతం సుంకాల స్థానంలో కొత్త వాటిని చేర్చనున్నారు.

ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ ప్రకారం డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ (డీడీజీ), పశువుల మేతకు ఉపయోగించే ఎర్రజొన్న, నట్స్, తాజా, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్‌తో పాటు పలు అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులు, అనేక ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా తొలగించడం, తగ్గించేందుకు భారత్ గతంలోనే అంగీకరించింది.

రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది.

వాణిజ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే మరోవైపు భారత్‌పై 301 నిబంధన కింద అమెరికా విచారణ జరుపుతోంది. కార్మికులతో వెట్టిచాకిరి చేయించడంతో ఉత్పత్తులను తయారు చేస్తోందన్న ఆరోపణలపై ఈ విచారణ జరుగుతోంది. ఈ సాకుతో భారత్‌పై పరోక్షంగా సుంకాలు విధించాలని భావిస్తోందని, దీన్ని వాణిజ్య చర్చల్లోనే అడ్డుకోకుంటే నష్టపోతామని నిపుణులు భారత్‌కు సూచిస్తున్నారు.