Telangana Education | ప్రైవేట్ బడులవైపు విద్యార్థుల మొగ్గు

Telangana Education | ప్రైవేట్ బడులవైపు విద్యార్థుల మొగ్గు

Telangana Education | నిబంధనలకు విరుద్ధంగా పెరుగుతున్న ప్రైవేట్ స్కూళ్లు
ప్రభుత్వ విద్యపై తగ్గుతున్న ప్రజల నమ్మకం
కునారిల్లుతున్న సర్కార్ పాఠశాలల పరిస్థితి
ప్రభుత్వ విద్య బలోపేతంపై పెరుగుతున్న డిమాండ్

Telangana Education | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. సర్కార్ బడులను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వమే పరోక్షంగా ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు ఎర్రతివాచీ పరుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం ఒక పాఠశాలకు కిలోమీటరు దూరంలో మరో పాఠశాల ఉండకూడదు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడలకు ఆనుకుని, కొన్ని చోట్ల గ్రౌండ్ ఫ్లోర్‌లో సర్కార్ బడి, పై అంతస్తులో ప్రైవేట్ బడి ఉండేలా అనుమతులు లభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్‌లోని అబిడ్స్ మహబూబియా, ఆలియా వంటి చారిత్రక ప్రభుత్వ పాఠశాలలకు కూతవేటు దూరంలోనే మూడు ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్-14లోని ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగానే ప్రముఖ కార్పొరేట్ స్కూల్ నడుస్తోంది. ఫిల్మ్‌నగర్, కర్మన్‌ఘాట్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.

ఒక్క నగరంలోనే కాదు… రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉంది. వెయ్యి మీటర్ల నిబంధన దేవుడెరుగు.. 50 నుంచి 100 మీటర్ల లోపే ప్రైవేట్ స్కూళ్లు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు.

ప్రైవేటుపైనే ఎక్కువ శాతం మొగ్గు

యూడైస్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 58 లక్షల మందికి పైగా విద్యార్థులుండగా, అందులో ఏకంగా 60 శాతం (36.17 లక్షలు) మంది ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లు కేవలం 28.98 శాతమే (11,407). అంటే తక్కువ సంఖ్యలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో అత్యధిక విద్యార్థులు చేరుతున్నారు.

63 శాతం (24,997) ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 31.76 శాతం విద్యార్థులే చదువుతున్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం ఏ స్థాయిలో సడలిపోయిందో చెప్పడానికి ఒకటో తరగతి అడ్మిషన్లే నిదర్శనం. ప్రతి 100 మంది విద్యార్థుల్లో కేవలం 26 మంది మాత్రమే సర్కార్ బడి మెట్లు ఎక్కుతున్నారు. మిగిలిన 74 మంది ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతున్నారు. ఏటా 300 వరకు కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులిస్తున్న విద్యాశాఖ, గల్లీకొకటి వెలుస్తున్న కిండర్‌గార్డెన్, ప్రీ-స్కూళ్లను గాలికొదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కునారిల్లుతున్న సర్కార్ బడులు

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. గతేడాది లెక్కల ప్రకారం రాష్ట్రంలో జీరో ఎన్రోల్మెంట్ (ఒక్క విద్యార్థి కూడా లేని) స్కూళ్ల సంఖ్య 1,897 నుంచి 2,046కు పెరిగింది. 7,057 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 15 లోపే ఉంది. 12,583 పాఠశాలల్లో కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఏకంగా 4,832 స్కూళ్లు సింగిల్ టీచర్‌తో నడుస్తున్నాయి.

విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో ప్రభుత్వ విద్యకు మహర్దశ పడుతుందని ఆశించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రంలోని 27 వేల స్కూళ్లను 4 వేలకు కుదిస్తామని సీఎం చేసిన ప్రకటన ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది పరోక్షంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సీబీఎస్ఈ సిలబస్ పేరుతో ప్రైవేట్ పాఠశాలలు దోచుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా ప్రైవేటుకు పట్టం కట్టడం ఎవరి ప్రయోజనం కోసమని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్ల అనుమతులను రద్దు చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.