‘భవిష్యత్ ఉంది.. చక్కగా చదువుకో బాబు’
- ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విద్యార్థికి డీసీహెచ్ఎస్ కౌన్సిలింగ్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: “నీకు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది చిన్నా.. చక్కగా చదువుకోవాలి. బడికి పొమ్మని తండ్రి చెబితే అంతమాత్రానికే పాయిజన్ ఎందుకు తాగావు బాబు? ఇంత చిన్న వయసులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు” అంటూ డీసీహెచ్ఎస్ డాక్టర్ మంతెన కోటేశ్వర్ ఒక విద్యార్థికి హితబోధ చేశారు.
వివరాల్లోకి వెళితే.. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన టెకం శంకర్ కుమారుడు టెకం రిషి అనే విద్యార్థిని పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సదరు విద్యార్థి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే అతడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, మంగళవారం ఆసుపత్రి వార్షిక తనిఖీల్లో భాగంగా వచ్చిన డీసీహెచ్ఎస్ డాక్టర్ కోటేశ్వర్.. బెడ్‌పై చికిత్స పొందుతున్న విద్యార్థి రిషిని పరామర్శించారు. అతడితో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు.
అనంతరం విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. రిషి కోలుకున్నాక మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు.
