Local Train Murder | చిన్న గొడవ.. యువకుడి ప్రాణం తీసింది
Local Train Murder | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ముంబై లోకల్ ట్రైన్‌లో జరిగిన ఘోర ఘటన ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రైలు కోచ్ తలుపు తెరిచి ఉంచే విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య ప్రారంభమైన చిన్నపాటి వాగ్వాదం చివరకు హత్యకు దారితీసింది. ఈ ఘటనలో మయాంక్ లోహర్ (22) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రయాణ సమయంలో కోచ్ తలుపు తెరిచి ఉంచడంపై ఇద్దరు ప్రయాణికుల మధ్య మాటామాటా పెరిగింది. కొద్దిసేపటికే వాగ్వాదం తీవ్రరూపం దాల్చగా, ఆగ్రహానికి గురైన గుర్తుతెలియని వ్యక్తి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో మయాంక్ లోహర్‌పై దాడి చేశాడు.
నిందితుడు యువకుడి కడుపులో పొడవడంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహ ప్రయాణికులు స్పందించేలోపే తీవ్ర రక్తస్రావంతో మయాంక్ మృతి చెందినట్లు సమాచారం.
ఘటన అనంతరం రైలు బొరివలి రైల్వే స్టేషన్ కు చేరుకోగానే నిందితుడు జనసందోహంలో కలిసిపోయి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రయాణికుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఘటన ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం అయ్యేలా చేసింది.
