అధికారుల్లో జవాబుదారీతనం పెరగాలి

రైల్వే స్టేషన్ పనుల్లో నాణ్యత లేకుంటే విజిలెన్స్ విచారణ: ఎంపీ మహేష్ కుమార్

ఏలూరు, ఆంధ్రప్రభ: ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో మరింత జవాబుదారీతనంతో పనిచేయాలని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు.

గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతున్నాయని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ప్రజల సమస్యలకు సంబంధించి తాను పంపిస్తున్న వినతులు, అర్జీలపై కొన్ని శాఖల అధికారులు స్పందించకపోవడం, కనీసం సమాధానం కూడా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

రైల్వే స్టేషన్ పనులపై అసంతృప్తి

ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపాదనల సమయంలో ఎయిర్‌పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తామని చూపించిన త్రీడీ నమూనాలకు, ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఎలాంటి పోలిక లేదన్నారు. మొదటి దశలో రూ.12 కోట్లతో చేపట్టిన పనుల్లో నాసిరకం మెటీరియల్ వినియోగించారని ఆరోపించారు.

ఎయిర్‌పోర్ట్ తరహా స్టేషన్‌కు బదులుగా గెస్ట్ హౌస్ మాదిరిగా మాత్రమే నిర్మాణాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బుకింగ్ కౌంటర్లు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, వసతి సదుపాయాలు, మరుగుదొడ్లు వంటి అంశాలను పట్టించుకోలేదని విమర్శించారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త స్టేషన్ మాదిరిగా ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచించారు.

పనుల్లో నాణ్యత లోపిస్తే విజిలెన్స్ విచారణకు సిఫారసు చేస్తానని రైల్వే అధికారులను హెచ్చరించారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఆసుపత్రి ల్యాబ్ తరలింపుపై అభ్యంతరం

ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్‌ను జంగారెడ్డిగూడెంకు తరలించకుండా అదే ఆసుపత్రిలో కొనసాగించాలని ఎంపీ సూచించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి ప్రత్యేకంగా ల్యాబ్ పరికరాల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని కోరారు.

పుష్కరాలు, తాగునీటి సమస్యలపై దృష్టి

గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లాలో రహదారుల నిర్మాణం, మరమ్మతుల కోసం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించాలని ఎంపీ సూచించారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో అవసరమైన రహదారి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

కైకలూరు బైపాస్ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, ఏలూరు నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఉంగుటూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే ఏలూరులో బీసీ వసతి గృహం నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.

ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలోని పరిశ్రమల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఇన్‌చార్జి డీఆర్ఓ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ, డీపీఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.