స్కూల్ పిల్లల భద్రతే లక్ష్యం
స్కూల్ పిల్లల భద్రతే లక్ష్యం
నందిగామలో స్కూల్ బస్సు డ్రైవర్లకు భద్రతా అవగాహన
ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు
డ్రైవర్లు నిబంధనలు పాటించాలి
విద్యార్థుల రక్షణలో నిర్లక్ష్యానికి తావులేదు
అవగాహన కల్పించిన అధికారులు..
నందిగామ, ఆంధ్రప్రభ : విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటూ నందిగామలో స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రవాణా కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు నందిగామ జడ్పీహెచ్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు, ఫైర్ సిబ్బంది పాల్గొని డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్కూల్ బస్సులు రోడ్లపైకి వెళ్లే ముందు తప్పనిసరిగా ఫిట్‌నెస్, సాంకేతిక పరిస్థితులను పరిశీలించుకోవాలని సూచించారు. బస్సుల్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. రిపేర్ అవసరమైన బస్సులను రోడ్డుపై నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో స్కూల్, కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఆర్టీఏ అధికారులు రాజు, దివ్య మాట్లాడుతూ డ్రైవర్ల లైసెన్సులు, బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, వాహనాల పరిస్థితిని నిరంతరం తనిఖీ చేస్తామని తెలిపారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లు శారీరక, మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే డ్రైవింగ్‌కు అనుమతి ఇస్తామని, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. టౌన్ సీఐ పి.శ్రీను మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్లు విధి నిర్వహణలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడటం, సందేశాలు పంపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రధాన కూడళ్ల వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, ఒకరిని మించి మరొకరు వెళ్లాలనే పోటీ ధోరణి ప్రమాదకరమని పేర్కొన్నారు.

స్కూల్ బస్సు డ్రైవర్లు యూనిఫాం ధరించడం తప్పనిసరి అని, విద్యార్థులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. విద్యార్థులను ఇళ్ల వద్ద దించేటప్పుడు ఆయాలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్న ప్రమాద ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రథమ కర్తవ్యమని, ప్రతి డ్రైవర్ తన బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని అధికారులు పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ నరేష్, టౌన్ ఎస్ఐ మహతి, ఆర్టీఏ అధికారులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, స్కూల్ బస్సు డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
