సమాచార హక్కు అమలు.. సుపరిపాలనకు నిదర్శనం
- ప్రజలకు సమాచారమే శక్తి.. ఆ హక్కు పరిరక్షణే అధికారుల బాధ్యత
- రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం స్పష్టీకరణ
- విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు
- నిబంధనలు ఉల్లంఘించిన కార్యాలయాలకు షోకాజు నోటీసులు
విజయవాడ, ఆంధ్రప్రభ : సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలోపేతమవుతాయని రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం స్పష్టం చేశారు. ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి చట్టబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం విజయవాడలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధనల అమలు, ప్రజా సమాచార అధికారుల (పీఐవోలు) నియామకం, మొదటి అప్పీలేట్ అధికారుల వివరాల ప్రదర్శన, సమాచార హక్కు దరఖాస్తులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు.
తొలుత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం డీఆర్‌వో కార్యాలయాన్ని సందర్శించి స.హ. చట్టం, 2005 అమలు తీరుతెన్నులను పరిశీలించారు. ఆపై ఆకస్మిక తనిఖీలలో భాగంగా దుర్గాపురం, గులాబీతోట స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు న్యూ జీజీహెచ్, వక్ఫ్‌బోర్డు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలను తనిఖీ చేశారు. అయితే సమాచార హక్కు చట్టం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో దుర్గాపురం, గులాబీతోట స్వర్ణవార్డు కార్యాలయాలకు, అదేవిధంగా 4(1)(బి) రిజిస్టర్‌తో పాటు మరికొన్ని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడంతో జీజీహెచ్‌కు నోటీసులు జారీచేశారు.
ఈ సందర్భంగా డా. రెహానా బేగం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కేవలం సమాచారం అందించే చట్టం మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే కీలక సాధనమన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ముందస్తుగా అందుబాటులో ఉంచితే సమాచార హక్కు దరఖాస్తులు, అప్పీళ్ల సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజలకు సకాలంలో సమాచారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేయాలని సమాచార కమిషనర్ డా. రెహానా బేగం సూచించారు.
