Temple | దుర్గగుడిలో అన్నదాన నాణ్యతపై తనిఖీ

Temple | దుర్గగుడిలో అన్నదాన నాణ్యతపై తనిఖీ

  • భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకర‌ణ‌…
  • చైర్మన్, ఈఓ, పాలక మండలి సభ్యులు

Temple | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ఆలయ పాలక మండలి, అధికారులు సమగ్ర తనిఖీ చేపట్టారు. మహా మండపం రెండవ అంతస్తులో ఉన్న అన్నదాన భవనంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఈ రోజు స్వయంగా పర్యవేక్షించిన చైర్మన్, ఈఓ, ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులతో కలిసి పంక్తిలో కూర్చొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అన్నదానంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రత, వడ్డింపు విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న అన్ని రకాల మెను వంటకాలను పరిశీలించి, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు.

అధికారులు భక్తులతో నేరుగా సంభాషించి, అన్నదాన సేవలపై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. భక్తులు అన్నప్రసాదం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, దేవస్థానం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. సిబ్బందితోనూ మాట్లాడిన అధికారులు సేవాభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆవరు శ్రీనివాస రావు, యలవరపు సుబ్రహ్మణ్య కుమార్, సుకాసి సరిత, ప్రత్యేక ఆహ్వానితులు బ్రహ్మమం అన్నదానం ఏఈఓ సుధా రాణి, క్లర్క్ ప్రణీత్, కాంట్రాక్టర్, సబ్‌స్టాఫ్ సిబ్బంది హాజరయ్యారు. భక్తులకు ఎప్పటికప్పుడు శుభ్రమైన, రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా చైర్మన్, ఈఓ స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

Leave a Reply