రాజముద్ర పాస్ పుస్తకాలతో రైతుల హక్కుల పరిరక్షణ..

రాజముద్ర పాస్ పుస్తకాలతో రైతుల హక్కుల పరిరక్షణ..

కర్షకులకు అండగా కూటమి సర్కార్
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
మూలపాడులో 167 మంది రైతులకు పాస్ పుస్తకాలు అందజేత

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలతో రైతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. కర్షకులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో 167 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే వసంత మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత ఫొటోలతో ముద్రించిన పాసు పుస్తకాలు ఇవ్వడం వల్ల అనేక సాంకేతిక, న్యాయ సంబంధిత సమస్యలు తలెత్తాయన్నారు. ప్రత్యేకంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఫొటోతో ముద్రించిన పుస్తకాల విషయంలో సమాజంలో గందరగోళం ఏర్పడిందన్నారు. భూమి రికార్డుల విషయంలో స్పష్టత లోపించిన కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తూ భూ యజమానులకు హక్కులపై సంపూర్ణ భరోసా కల్పిస్తోందని తెలిపారు. రాజముద్రతో రూపొందించిన పాసుపుస్తకాలు ప్రభుత్వ అధికారిక ధ్రువీకరణకు ప్రతీకగా నిలిచి, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చేస్తాయన్నారు. రుణ సదుపాయాలు కూడా సులభంగా లభిస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తగు ప్రాధాన్యమిస్తోందన్నారు. సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, సోలార్ యూనిట్లు, అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు, సకాలంలో ఎరువులు పంపిణీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పన, పాడి రైతులకు గోకులం షెడ్స్, పలు ప్రోత్సాహకాలు ఇస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply