ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలి: డీఎంహెచ్వో
- ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దు
- ఆసుపత్రుల్లో సేవల నాణ్యతపై డీఎంహెచ్వో ఆరా
- మాతా–శిశు సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు
- రోగులకు మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్బాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముత్యాలం చెరువు (కొత్తగేట్) పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలను సమీక్షించారు.
ఆసుపత్రుల్లో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఆన్లైన్ నమోదులను పరిశీలించిన డీఎంహెచ్వో ప్రతి కార్యక్రమంలో నూటికి నూరు శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని, ప్రజలకు అంకితభావంతో సేవలు అందించాలని సూచించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సేవలు, గర్భిణీల సంరక్షణ, మాతా–శిశు ఆరోగ్య సేవలను పరిశీలించిన ఆయన, నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని వైద్యాధికారులకు ఆదేశించారు.
మండలంలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముత్యాలం చెరువు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనంలో వరదల కారణంగా ఏర్పడిన పగుళ్లను పరిశీలించిన డీఎంహెచ్వో, భవనం స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలన్నింటినీ సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడిన డాక్టర్ శ్రావణ్బాబు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని పరీక్షలు, మందులు, వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా లభిస్తున్నాయని, అవసరం లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక భారం మోసుకోవద్దని సూచించారు.ఈ తనిఖీల్లో డీపీఎంఓ డాక్టర్ నవీన్, జిల్లా ప్రోగ్రాం అధికారి మహేశ్వరరావు, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీం, సీహెచ్వో నారాయణరావు, ఎల్టీఈ కాదిర్, సూపర్వైజర్ రోశయ్యతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
